Property tax | కోల్ సిటీ, నవంబర్ 20 : చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్, జిల్లా అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ గురువారం కోరారు. నోటీసులు అందుకుని అప్పటికి కూడా ఆస్తి పన్నులు చెల్లించడంలో స్పందించకపోతే రెండో హెచ్చరికగా ఆ గృహాలకు మున్సిపాలిటీ నుంచి అందే సేవలను నిలిపివేయడంతోపాటు చట్ట ప్రకారం వారి ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని పని దినాలలో ఉదయం నుంచి సాయంత్రం 5 గం.ల వరకు నగర పాలక కార్యాలయంలోని కౌంటర్లో పన్ను మొత్తం చెల్లించవచ్చని, కార్యాలయంకు రాలేని స్థితిలో ఉన్న వారు దగ్గరలోని మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ సైట్ ను సందర్శించి చెల్లించవచ్చని చెప్పారు. అది కూడా సాధ్యం కాదనుకుంటే సంబంధిత వార్డు అధికారి వద్ద గల హ్యాండ్ హెల్త్ యంత్రం ద్వారా పన్ను చెల్లించి ఆన్లైన్ రశీదు పొందాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో అర్ధ సంవత్సరానికి సంబంధించిన పన్ను మొత్తం పెనాల్టీ లేకుండా చెల్లించడానికి ఈ నెలాఖరు వరకే అవకాశం ఉందని చెప్పారు. కావున జరిమానాలు, జప్తుల బారిన పడకుండా వెంటనే చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.