Singareni | గోదావరిఖని : కార్మికులకు సరైన పనిముట్లు, కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేకపోయినా, వైద్యం అందక పోయినా మాట్లాడని గుర్తింపు సంఘం, సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించని గుర్తింపు సంఘం.. యాజమాన్యానికి వత్తాసు పలుకడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు మాయమని, అమ్ముకున్నారని, అక్రమ రవాణా జరిగిందని తాము ఆరోపించడం లేదని, సంస్థ వెబ్ సైట్ లో చూపిన 40 లక్షల టన్నుల బొగ్గునిల్వలు ఎక్కడున్నాయో చూపమని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉత్పత్తికాని బొగ్గును ఎక్కువగా చూపడం మూలంగా సంస్థకు, కార్మికులకు వందల కోట్ల నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
లేని ఉత్పత్తిని చూపడం కారణంగా, ఇన్కమ్ టాక్స్, సెస్, రాయల్టీ, కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల మూలంగా జరుగుతున్న నష్టంపై అడిగితే తప్పా అని ప్రశ్నించారు. జాతీయ సంఘాలు ప్రభుత్వానికి, యాజమాన్యానికి తొత్తులుగా మరి వత్తాసు పలుకడం మానుకోవాలని హితవు పలికారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై టీబీజీకేఎస్ నిరంతరం పోరాడుతుంటే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సింగరేణి కార్మికుల పక్షాన నిలవాల్సి ఉండగా యజమాన్యానికి అడుగులకు మడుగులోత్తుతు కొమ్ము కాస్తుందని ఆయన ఆరోపించారు. అవినీతి అక్రమాలపై విచారణ కోరాల్సిన గుర్తింపు కార్మిక సంఘం అదంతా మరిచిపోయి తామే యజమాన్యం అన్నట్లుగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నారు.
ఇప్పటికైనా ఎర్రజెండా పార్టీగా చెప్పుకుంటున్న ఏఐటియుసి తొత్తుగా మారకుండా కార్మికుల పక్షాన నిలిచి వారి అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, జాహెద్ పాషా చెల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాస్, చల్ల రవీందర్ రెడ్డి, ఇందూరు సత్యనారాయణ మదనపల్లి, మొదుంపల్లె రాజేశం తదితరులు పాల్గొన్నారు.