– రామగుండం కార్పొరేషన్లు విలీనంపై వ్యతిరేకత
– ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళనకు సిద్ధమవుతున్నవిలీన ప్రతిపాదిత గ్రామాలు
– అధికార పార్టీకి తలనొప్పిగా మారిన వైనం
RAMAGUNDAM | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థల్లో పలు గ్రామాల విలీనంపై అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయడంతో ఆయా గ్రామాలలో వాడి వేడి వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో విలీనమయ్యేందుకు ఒప్పుకోమంటూ ఆయా గ్రామాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘బల్దియాలో విలీనం అయ్యేనా’ అనే శీర్షిక వచ్చిన కథనం ఆయా గ్రామాలలో చర్చకు దారితీసింది.
గత ప్రభుత్వం విలీనం చేసి గ్రామస్తుల అభిప్రాయాలను గౌరవించి మళ్లీ వెనక్కు తీసుకుందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అవే గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేయడానికి ప్రతిపాదిస్తే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి వస్తున్న వ్యతిరేకతను బట్టి పరిశీలిస్తే విలీన ప్రక్రియ అంత సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ఆయా గ్రామాలలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు తలనొప్పిగా పరిణమించింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలా..? గ్రామస్తుల వైపు ఉండాల అనేది తేల్చుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామంలో రాజకీయ పార్టీలకు అతీతంగా సమావేశమయ్యారు. కార్పొరేషన్లో విలీనం చేయవద్దని, గ్రామ పంచాయతీలోనే యథావిధిగా కొనసాగించాలని మూకుమ్మడి తీర్మానం చేశారు. విలీనం అంశంపై సుధీర్ఘంగా చర్చించారు. స్పష్టత రాని పక్షంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. గతంలో అప్పటి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తమ గ్రామంను కార్పొరేషన్లో విలీనం చేయడానికి ప్రతిపాదనలు పంపించగా ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహృదయంతో కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లి ఈ గ్రామాల విలీనం ప్రక్రియను నిలుపుదల చేసి యథావిధిగా జీపీలోనే కొనసాగించారని, దాంతో గ్రామస్థులంతా వంద రోజుల పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే సైతం గతంలో విలీనంకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు మళ్లీ విలీనం చేయాలని ప్రతిపాదించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీర్మాన పత్రంను పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మీకి సైతం అందజేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ నిమ్మరాజల సాగర్, మాజీ సర్పంచ్ అర్శనపల్లి మల్లేశ్వరి శ్రీనివాస్, కందుల సత్తయ్య, అర్శనపల్లి రాజు, జగన్మోహన్ రావు, బీజేపీ నాయకులు గుండు తిరుపతి. గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విలీనం జాబితాలో గల మిగతా గ్రామాలు సైతం తిరుగుబాటు బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.