కార్పొరేషన్ ఆగస్టు : కరీంనగర్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు కలెక్షన్ కింగ్‌ల వ్యవహరిస్తున్నారని ప్రతి దరఖాస్తుకు డబ్బు లేకుండా ప్రొసీడింగ్స్ అందించడం లేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు. శనివారం స్థానిక తారక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఎల్ఆర్ఎస్ కింద 39 వేలకు పైగా దరఖాస్తులు వస్తే 24 వేలకు పైగా దరఖాస్తులకు డబ్బులు కట్టాలని అధికారులు సమాచారం అందించారన్నారు. వీటిల్లో 8 పైగా దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించగా ఇప్పటివరకు కేవలం 4000 మందికి ప్రొసీడింగ్స్ మాత్రమే అందించారని పేర్కొన్నారు.
ఎల్ఆర్ఎస్ భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు షార్ట్ ఫాల్ పేరుతో అక్రమాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సాయంత్రం కార్యాలయంలో ఉండకుండా హోటల్స్‌లో అడ్డావేసి దరఖాస్తుదారుల నుండి భారీగా డబ్బులు తీసుకొన్న తర్వాతే ప్రొసీడింగ్స్ అందిస్తున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ అధికారులు దర్జాగా అవినీతి లకు పాల్పడుతుంటే ఐఏఎస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దరఖాస్తులు అధికారుల లాగిన్సులో నెలలు తరబడి పెండింగ్‌లో ఉంటున్న ఐఏఎస్ అధికారులు ఎందుకు వారి మీద చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు.
ఐఏఎస్ అధికారులు అంటే ప్రజల్లో అవినీతిని అడ్డుకునే వారన్న నమ్మకం ఉందని, దీనిని కాపాడాలని జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారిని కోరారు. ఇటీవల శిథిలావస్థకు చేరిన భవనాల నోటీసులు ఇచ్చారని వీటిలో సైతం టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బుల కోసం ఆయా ఇంటి యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.