..పక్క ఫొటోలో రేషన్ కార్డు చూపుతున్నది పుట్టపాక శ్రీకాంత్. హుజూరాబాద్ మండలంలోని ఇప్పల నర్సింగాపూర్. ఆ యువకుడికి మూడేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇన్నాళ్లూ ఉమ్మడి కుటుంబంలో ఉండగా, రేషన్ కార్డు తల్లిదండ్రులతోనే ఉన్నది. ఉమ్మడిగా ఉన్న కార్డులో తన పేరు తొలగించుకొని, కొత్త రేషన్‌కార్డు కోసం గత నెల 15న దరఖాస్తు చేసుకున్నాడు. అయితే మే 25 తర్వాత కొత్తగా రేషన్‌కార్డు మంజూరైంది. శ్రీకాంత్ కార్డుతో తనకు కేటాయించిన షాపులోకి వెళ్లాడు.
మూడు నెలల రేషన్ కోసం డీలర్‌ను అడిగితే.. ‘కార్డు వచ్చింది.. కానీ రేషన్ మంజూరు కాలేదు’ అని చెప్పడంతో కంగుతిన్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే గత నెల 20వ తేదీకి ముందు ఉన్న కార్డులకు మాత్రమే బియ్యం కోటా కేటాయిస్తారని చెప్పడంతో నిరాశ చెందాడు. ఈనెల రాకపోయినా పర్వాలేదు, వచ్చే నెలలో అయినా ఇస్తారా..? అని అడిగాడు. తనకు తెలియదని డీలర్ చెప్పడంతో.. ‘కార్డు వచ్చినా.. రేషన్ రాకపాయే’ అంటూ ఉసూరుమంటూ వెనుదిరిగాడు. ఇది ఒక్క పుట్టపాక శ్రీకాంత్ బాధ మాత్రమే కాదు.. ఉమ్మడి జిల్లాలో కొత్తగా రేషన్‌కార్డులు మంజూరైన వేలాది మందిది ఇలాంటి పరిస్థితే.
హుజూరాబాద్/ కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 10 : రేషన్‌కార్డుదారులకు బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతినెలా 20న లబ్ధిదారుల వివరాలతో కూడిన ఇండెంట్ పంపుతారు. అందులో గత లబ్ధిదారులతోపాటు ఆ తేదీలోగా కొత్తగా కార్డులు మంజూరైన వారి వివరాలు కూడా పంపిస్తారు. అదే విధానంలో గత నెల కూడా అన్ని జిల్లాల నుంచి ఇండెంట్ పంపారు. ప్రస్తుతం ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఆ మేరకు రేషన్ సరుకులు వచ్చాయి.
కరీంనగర్ జిల్లాలో చూస్తే.. 2,90,402 కార్డుల పేర 8,79,888 మందికి ఒక్కొక్కరికి 18 కిలోల చొప్పున మూడు నెలల కోటా కింద 16,748.667 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం విడుదలయ్యాయి. కానీ, గత నెల 20వ తేదీ తర్వాత నమోదైన కార్డులకు సంబంధించి రేషన్ విడుదల కాలేదు. కరీంనగర్ జిల్లాలో కొత్త కార్డులు సుమారు వెయ్యి వరకు ఉండగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3వేల నుంచి 4వేల వరకు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ కొత్త కార్డుదారులకు బియ్యం విడుదలపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.
అధికారులు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో కొత్త రేషన్‌కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండగా, తమకు వస్తయా.. రావోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్డులు వచ్చినా ఏం సంబురం లేదని నిరాశ చెందుతున్నారు. ఈ నెలలో తప్పినా.. జూలై, ఆగస్టు నెలల కోటా అయిన తమకు విడుదల చేయాలని కోరుతున్నారు. ఎప్పటిమాదిరిగానే ప్రతి నెలా 20లోగా పెట్టే ఇండెంట్లో గత నెల 21 నుంచి అప్రూవ్ అయిన కార్డులకు ఈ నెలలో బియ్యం కోటా విడుదలయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
నేను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నా. పోయిన నెలలో కొత్త రేషన్‌కార్డు కోసం ధరఖాస్తు చేసుకోగా వచ్చింది. దానిని పట్టుకుని రేషన్ డీలర్ వద్ద కెళ్లి బియ్యం ఇయ్యాలని అడిగిన. ఆయన పంపిణీ జాబితాలో నీ పేరు లేదని చెప్పాడు. నాకు మంజూరైన కార్డును చూపితే ‘పోయిన నెల 20 తర్వాత నీకు కార్డు వచ్చింది. అందుకే ప్రభుత్వం నీకు బియ్యం కోటా కేటాయించలేద’ని చెప్పిండు. ఈ నెల కాకపోయినా, వచ్చే నెలలో అయినా వస్తాయా.. రావా? చెప్పు అని అడిగితే ‘నాకు తెల్వదు. అధికారులను అడుగు’ అంటున్నడు. మూడు నెలల బియ్యం రాకపోతే కొత్త కార్డు ఇచ్చి ఏం లాభం? అధికారులు పట్టించుకోవాలి. కొత్త కార్డుదారులకు బియ్యం ఇవ్వాలి.
– పుట్టపాక రమేశ్, ఇప్పల నర్సింగాపూర్ (హుజూరాబాద్ మండలం)
రేషన్‌కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ. ప్రతి నెలా 20 లోగా అప్రూవ్ అయిన కార్డులకు మాత్రమే బియ్యం కోటా కేటాయిస్తారు. ఆ తర్వాత అప్రూవ్ అయిన వాటికి వచ్చే నెలలో బియ్యం విడుదలవుతాయి. ఇదేవిధంగా మే 20లోగా మంజూరైన కార్డులకు కూడా రేషన్ కోటా విడుదలైంది. ఆ తర్వాత మంజూరైన వారికి బియ్యం కేటాయింపుపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరికి జూలై, ఆగస్టు నెలల కోటా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
– నర్సింగారావు, డీఎస్వో (కరీంనగర్) జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి