రేషన్ బియ్యం దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. ఇటీవల ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి ఒకేసారి సన్నబియ్యం ఇస్తుండడంతో మరింత విచ్చలవిడిగా సాగుతున్నది. ఆదివారం వేములవాడలోని మూతపడిన ఓ రైస్ మిల్లులో ఏకంగా 514 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టుకోవడం దందా తీరును బహిర్గతం చేసింది. దళారులు, రేషన్ డీలర్ల నుంచి సన్నబియ్యం కొని, వ్యాపారం చేస్తున్నట్టు తనిఖీల్లో బట్టబయలైంది.
వేములవాడ, ఏప్రిల్ 13 : ఉమ్మడి జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతున్నది. ఎక్కడో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నది. ఇటీవల ప్రభుత్వం ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యం ఇస్తుండడం దళారులకు మరింత వరంలా మారింది. ఆదివారం వేములవాడ హరిహర ఇండస్ట్రీస్ రైస్‌మిల్‌లో ఒకేసారి 514 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం విచ్చలవిడిగా సాగుతున్న దందాను బయటపెడుతున్నది. నిజానికి ఈ రైస్ మిల్లుకు అధికారులు ఏడాదిగా మిల్లింగ్‌కు ధాన్యాన్ని కేటాయించడం లేదు.
అయినప్పటికీ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, రైస్‌మిల్ తరహాలో నిల్వలు చేసి అక్రమ వ్యాపారానికి తెరలేపినట్టు తెలుస్తున్నది. రైస్‌మిల్లు తనిఖీకి వచ్చిన అధికారులు నిల్వలను చూసి షాక్ అయ్యారు. ఉదయం 9గంటల నుంచి నిల్వలను లెకించి, సీజ్ చేసి కేసు నమోదు చేసే వరకు అర్ధరాత్రి 12 గంటలు అయిందని అధికారి ఒకరు తెలిపారు. అంటే, రేషన్ సన్నబియ్యం ఎంతలా సేకరించారో అర్థమవుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొదటిసారి ఇంత భారీగా సన్నబియ్యం పట్టుకోవడం చూస్తే అక్రమ వ్యాపారం ఎంతలా సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. కొంతకాలంగా రైస్‌మిల్ పనిచేయడం లేదని ఎవరు వస్తారులే అనుకొని, యజమానులు ఏకంగా అక్రమ వ్యాపారానికి తెరలేపినట్టు తెలుస్తున్నది.
దళారులు, రేషన్ డీలర్ల నుంచి కిలోకు 14 నుంచి 18 వరకు కొనుగోలు చేస్తూ.. ఆ తర్వాత ఈ రైస్ మిల్లులో నిల్వచేస్తున్నారు. తర్వాత బహిరంగ మారెట్లో 25కి విక్రయిస్తున్నట్టు, అలాగే ఇతర మిల్లులకు కూడా అమ్ముతున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నట్లు సమాచారం. అధికారులు పర్యవేక్షణ పెంచితే మరెన్నో అక్రమాలు బయటపడే అవకాశముంటుందని ప్రజలు చెబుతున్నారు. గ్రామాల్లో మోపెడ్లపై వచ్చి రేషన్ బియ్యం కొని దందాలు చేస్తున్నా పర్యవేక్షించేవారు లేరని ఆరోపిస్తున్నారు.