మానకొండూర్, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ సక్రమంగా అమలు కాక, 24 గంటల కరెంట్, సాగునీరు లేక, సకాలంలో ఎరువుల అందక రైతులు పడుతున్న అవేదనలు, చేస్తున్న ఆక్రందనలు కాంగ్రెస్ సర్కార్‌కు కనబడడం లేదా? అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిలదీశారు. శనివారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో రైతుల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అని భావించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఅర్ వారికోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు.
రాష్ట్రం నుంచే దేశానికి ఒక ఆదర్శ రైతును అందించిన చరిత్ర కేసీఆర్, బీఅర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని, కనీసం యూరియా అందించని నిస్సహాయస్థితిలో సర్కారు ఉందని విమర్శించారు. మళ్లీ రైతులను ఆత్మహత్యలవైపు తీసుకుపోవడమే ఇందిరమ్మ రాజ్యామా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలతో కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరంలో లారీలను నింపి ఇసుక పంటలు పండిస్తున్నాడని ఎద్దేవా చేశారు. మానకొండూర్ నియోజకవర్గం చుట్టూ మానేరు ఉన్నా ఇక్కడి గ్రామాల రైతులకు సాగునీరందడం లేదన్నారు.
గతంలో మూడు పంటలకు నీరందించిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఉన్న ప్రేమ రైతుల సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెడుతారని తేల్చిచెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించకకుంటే రేవంత్సర్కార్కు పతనం తప్పదని, మానకొండూర్ నియోజకవర్గం నుంచే రైతులను ఏకంచేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీలు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు శాతరాజు యాదగిరి, రాచకట్ల వెంకటస్వామి, నెల్లి శంకర్, బోడ రాజశేఖర్, బొల్లం అనిల్ పాల్గొన్నారు.