ఇల్లంతకుంట, మే 10 : రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. లేదంటే రైతులకు మద్దతుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
రైతులను ఏడ్పించిన రాజ్యం ఏనాడు నిలువలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో వరి, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని, ముస్కానిపేటలో మక్కలు, వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని వాపోయారు.
కొనుగోలు కేంద్రాలు ధాన్యం నిల్వలతో నిండిపోయాయని, వానకాలం రావడానికి ఇంకో ఇరువై రోజుల సమయమే ఉన్నదని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అధికారులకు, రైస్ మిల్లర్లకు సమన్వయం లేకపోవడం వల్లే లారీలు త్వరగా లోడు ఖాళీ చేయలేక పోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. చాలా కేంద్రాల్లో రైతులు ధాన్యం కుప్పులపై ప్రాణాలు కోల్పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహా రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, వెంకటేశం, రాములు, అనిల్, తిరుపతి రెడ్డి. సలీం తదితరులు పాల్గొన్నారు.