ఉమ్మడి జిల్లాలో పలు జిల్లా ట్రెజరీ, సబ్‌ట్రెజరీ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ శాఖ.. తాజాగా, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వివరాలను ఆన్లైన్ చేయడానికి వసూలు చేస్తున్న తీరు వారి అవినీతి దాహార్తికి నిదర్శనంగా నిలుస్తోంది. పలు చోట్ల అధికారులు నిజాయితీగా పనిచేస్తుండగా.. సిరిసిల్ల డీటీవో, వేములవాడ ఎస్టీవో కార్యాలయాల్లో మాత్రం ఒక్కో ఫైల్ వివరాలు అప్లోడ్ చేసేందుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అడిగిన మామూళ్లు ఇచ్చే వరకు ఫైలు ముట్టుకునే ప్రశ్నేలేదని నిర్మొహమాటంగా చెబుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే బాటలో మరికొన్ని ఎస్టీవో కార్యాలయాలు నడుస్తుండగా.. ఉద్యోగ విరమణ పొందిన తమకు గౌరవం ఇవ్వాల్సిన సదరు అధికారులే లంచాల కోసం వేధిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్రంలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు 30 మార్చి 2021 నుంచి అమలులోకి వచ్చాయి. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు సర్వీసు కలిసి వచ్చింది. దీంతో గడిచిన మూడేళ్లుగా దాదాపు రిటైర్మెంట్లు ఆగిపోయాయి. తిరిగి ఈ ఏడాది మార్చి 30 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి. ఆ మేరకు ప్రతి నెలా వందల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతున్నారు. మున్ముందు ఈ సంఖ్య పెరగనున్నది. నిజానికి ఉద్యోగ విరమణకు సంబంధించి ఉపాధ్యాయులకైతే జిల్లా విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులకైతే ఆర్జేడీ ముందుగా లేఖలు పంపిస్తారు. అలాగే.. వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా ఉద్యోగ విరమణ తేదీలను వివరిస్తూ లేఖలు అందుతాయి. సదరు లేఖల పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారి స్వరీసు బుక్ ఆధారంగా ఎవరికి వారే తమ తమ పూర్తి వివరాలతో ఒక ఫైల్ తయారు చేసుకుంటారు. సంబంధిత అధికారుల ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత సదరు ఫైలును నేరుగా వెళ్లి సదరు ఉద్యోగులే హైదరాబాద్‌లోని అకౌంటెంట్స్ జనరల్ (ఏజీ) కార్యాలయంలో సమర్పిస్తారు. ఏజీ అధికారులు.. సంబంధిత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగి వివరాలు పరిశీలించిన తర్వాత.. గ్రాట్యుటీ, కమిటేషన్ పేరుతో రెండు పేపర్లతో కూడిన మూడు సెట్లను పంపిస్తారు. ఇందులో ఒక సెట్టును ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగికి, మరొకటి సంబంధిత కార్యాలయం, ఇంకో సెట్‌ను సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తారు. ఏజీ కార్యాలయం నుంచి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి వచ్చిన వివరాలను డీటీవో అక్కడి నుంచి సంబంధిత ఉద్యోగ విమరణ పొందిన ఉద్యోగి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయాలకు పంపిస్తారు.
ఒక ఉద్యోగి కావచ్చు.. ఉపాధ్యాయుడు కావచ్చు.. దశాబ్దాల కాలం పాటు ఆయా రంగాల్లో సేవలందించి రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. వారు అప్పటికే అచేతన స్థితికి చేరుకుంటారు కాబట్టి.. వారికి రావాల్సిన పెన్షన్, ఇతర భత్యాల కోసం.. ఆయా శాఖల ఉద్యోగులు స్వచ్ఛందంగా సహకారం అదించాలి. కానీ. ఈ స్పృహ ట్రెజరీ కార్యాలయాల్లో కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇందులోనూ కొన్ని జిల్లా ట్రెజరీ, సబ్‌ట్రెజరీ కార్యాలయాలు నిజాయితీగానే పనిచేస్తున్నాయి. కానీ, మెజార్టీ కార్యాలయాలు మాత్రం అవినీతికి కేరాఫ్‌గా మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్‌ట్రెజరీ, వేములవాడలోని సబ్ ట్రెజరీ కార్యాలయాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఏజీ నుంచి ట్రెజరీ కార్యాలయాలకు వచ్చిన పత్రాల ప్రకారం సంబంధిత ఉద్యోగ విమరణ పొందిన ఉద్యోగికి అన్ని రకాలుగా అండగా నిలిచి.. సదరు వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ట్రెజరీ కార్యాలయాల నుంచి ఆన్లైన్లో నమోదు చేయాలి. మొత్తం వివరాలను పూర్తిగా పరిశీలించి అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే సంబంధిత రిటైర్డు ఉద్యోగులకు పింఛన్ ప్రారంభమవుతుంది. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న ట్రెజరీ అధికారులు.. వివరాలను ఆన్లైన్ చేయడానికి ముడుపులు దండిగా వసూలు చేస్తున్నారు. వీటిపై ప్రశ్నిస్తే ఎక్కడ తిరకాసు పెడుతారో అన్న భయంతో వారు అడిగిన మొత్తం ఇవ్వడానికి తప్పని పరిస్థితుల్లో ఒప్పుకొంటున్నారు. ఈ తరహా వ్యవహారం సిరిసిల్ల, వేములవాడలో భారీ మొత్తంలో నడుస్తోంది. ప్రధానంగా ఒక్కో ఫైల్ అప్లోడ్ చేయడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని రిటైర్డు ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇవ్వని వారి ఫైళ్లు ముట్టుకోవడం లేదని అంటున్నారు. అడిగిన మొత్తం ఇచ్చినట్లుగా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఫైళ్లు కదులుతున్నాయని చాలా మంది ‘నమస్తే తెలంగాణ’ దృష్టికి తెచ్చారు. అంతే కాదు.. ఈ విషయంపై ఏసీబీ కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాము రిటైర్మెంట్ అయి అచేతన స్థితిలోఉంటే తమ నుంచి లంచాలు.. అది కూడా డిమాండ్ చేసి వసూలు చేయడం ఏమిటన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్ల, వేములవాడ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో జరుగుతున్న అవినీతి వ్యవహారాన్ని ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు రిటైర్డు ఉద్యోగులు ఆయా సంఘాల దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. తమకు అండగా నిలువాలని, అవసరమైతే తమతో పాటు వచ్చి.. మామూళ్లు అడుగుతున్న అధికారులతో మాట్లాడాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ విషయంలో తక్షణం స్పందించాల్సిన సదరు సంఘాలు మాత్రం.. రేపు, మాపు అంటూ తప్పించుక తిరుగుతున్నట్లుగా సదరు రిటైర్డు ఉద్యోగులు తెలిపారు. మొత్తంగా సంఘాల దాటవేత ధోరణి చూస్తే.. అక్రమార్కులకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నట్లుగా తమకు అర్థమవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్డు అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలు, అందులోనూ ట్రెజరీ కార్యాలయాల్లో వివరాలు అప్లోడ్ అయిన వారితో కలిసి మాట్లాడితే… వసూళ్ల పర్వం మొత్తం బహిర్గతమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు నిజంగా విచారణ చేస్తే.. తాము ఎవరికి ముడుపులు ఇచ్చామో చెపుతామని పలువురు రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అంతే కాదు.. ఇక నుంచి నెలానెలా ఉద్యోగ విరమణ పొందే ఉద్యోగల సంఖ్య పెరగనుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు వసూళ్లకు అడ్డువేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా పదవి విమరణ పొందే ఉద్యోగులకు కొంత మేరకైనా లాభం చేకూరుతుంది.