రాంనగర్, మార్చి 14: ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందుకు చేరి ఇంటి యజమాని నుంచి దౌర్జన్యంగా వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎవరైనా చనిపోయిన సందర్భంలోనూ పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను డబ్బుల కోసం వేధిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
ఇతరుల శ్రమను దోచుకోవడం అనైతికమన్నారు. ట్రాన్స్‌జెండర్స్ గౌరవంగా జీవించడానికి ప్రభుత్వం ఇటీవల బ్యాంక్ రుణాలు మంజూరు చేస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఐదు నిమిషాల్లో బాధితుల వద్దకు దగ్గరలో ఉన్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది చేరుకొని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.