Ramagundam | ఫర్టిలైజర్ సిటీ, జూన్ 6 : మూడో ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగా విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శ్రీలతను శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఘనంగా సత్కరించారు.
ఇటీవల హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో నిర్వహించిన మూడో ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో 35 నుంచి 45 సంవత్సరాల వయో విభాగంలో జరిగిన యోగా పోటీల్లో శ్రీలత ప్రతిభ కనబర్చి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆమెకు అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి శాఖకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, కమాన్‌పూర్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.