Ramagundam Municipality | కోల్ సిటీ, మే 25 : రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ వైఖరి పై కార్మిక లోకం భగ్గుమంది. పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ మృతికి నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం టోకెన్ సమ్మె చేపట్టారు. సుమారు నాలుగు గంటల పాటు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. బల్దియా కమిషనర్ ను బర్తరప్ చేయాలంటూ పెద్దపెట్టున నినదించారు. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కమిషనర్ ను ఇక్కడ నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ వైఖరి పై మహిళా కార్మికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, నడిపెల్లి మురళీధర్ రావు, ఎంఏ గౌస్, 41 డివిజన్ కార్పొరేటర్ మార్కాపురి సూర్య మాట్లాడారు.
మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ పారిశుధ్య కార్మికుల ను వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈనెల 21న మల్లమ్మ అనే మహిళ కార్మికురాలు వడదెబ్బకు గురై పని ప్రదేశంలోని కుప్ప కూలిపోతే ఏమాత్రం స్పందించకుండా, తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమని అన్నారు. కమిషనర్ అలసత్వం వల్లే మల్లమ్మ మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహం కుళ్ళిపోయి వాసన రావడంతో గుర్తించాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. కార్మికులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని, పని ఒత్తిళ్లతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
మల్లమ్మ కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని మున్సిపల్ కమిషనర్ ను బర్తరఫ్ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్ర ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కార్మికులను కట్టు బానిసలుగా చూస్తూ, వారిపై పని భారాన్ని మోపుతూ, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ముగ్గురు కార్మికులు ఎండ దెబ్బ తగిలి ఆసుపత్రి పాలైనారని,
మరో ముగ్గురు కార్మికులు మరణించారని, అవి మరవక ముందే ఇప్పుడు గాజనవేన మల్లమ్మ వడ దెబ్బతో చనిపోవడం కార్మికులను కలవరపరుస్తుందని అన్నారు. మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందివ్వకుండా నిర్దేశించిన పని పూర్తి చేయాలని లేకుంటే మాస్టర్ వేయమని, పనుల్లోంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.
అంతేకాకుండా చీపుర్లు, చెప్పులు, కొబ్బరి నూనె, సబ్బులు, తట్టలు, పారలు, బ్లౌజులు, మాస్కులు ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రామా చారీ, కిషన్ నాయక్, గుంజ రమణ, రామలక్ష్మి, రేణికుంట్ల సారయ్య,పాముకుంట్ల సునీత, బోయిని రవీందర్, తోటపెల్లి శేఖర్,శోభన్, మద్దికుంట శ్రీకాంత్, కావటి సాగర్, ఓర్సు రమాదేవి, కౌసల్య, బిఆర్ఎస్ అనుబంధ యూనియన్ నుండి వేల్పుల రాయమల్లు, రొడ్డ రాజేందర్ రమేష్,రూప,రవి, నర్సయ్య, పద్మ, లత, ముంతాజ్ లతోపాటు సుమారు 400 మంది కార్మికులు ఈ మెరుపు సమ్మెలో పాల్గొన్నారు.