Ramagundam | కోల్ సిటీ, ఏప్రిల్ 2: గోదావరిఖని నగరంలో కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అధికారులను ఆదేశించారు. నగర పాలక మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీ నగర్, కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. కాలువలపై ఉన్న నిర్మాణాలను గుర్తించిన ఆయన వాటిని తొలగించాలని తెలిపారు. నగరంలో మురికి కాలువలు సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
నగర సుందరీకరణకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పాలక వర్గం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. వానాకాలం లోపు పూడికతీత తొలగింపు పూర్తి కావాలన్నారు. వలసల నివారణకు నగర అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నగరంలోని మారుమూల నుంచి సిటీ సెంటర్ వరకు 25 నిమిషాల్లో చేరుకునేలా రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ నగరంలో ప్రథమ ప్రాధాన్యతగా కాలువల్లో పూడికతీత తొలగింపు లక్ష్యంగా నిర్ధారించుకున్నట్లు తెలిపారు. మార్కెట్ వ్యాపారులు వ్యర్థాలను కాలువల్లో పడేసినట్లయితే మార్కెట్ నుంచి ఖాళీ చేయించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తిప్పారపు మానస, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎస్ఈ గురువీద, టీపీఎస్ నవీన్, డీఈలు, ఏఈలు తదితరుల పాల్గొన్నారు.