గోదావరిఖని, సెప్టెంబర్ 28 : ఖురూజ్ కమ్మి భూములకు అక్టోబర్ 1న చరిత్రలో నిలిచిపోయేలా పట్టాలు పంపిణీ చేయనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. స్థానిక జేఎల్ఎన్ స్టేడియంలో అక్టోబర్ 1న రామగుండం దశాబ్ది ప్రగతి సభ నిర్వహించనుండగా, దీనికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలి వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రామగుండం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి, చేపట్టబోయే సంక్షేమంపై మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు.
నియోజక వర్గంలో ఐటీ ఇండస్ట్రియల్ పార్కులకు భూమిపూజ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఖురూజ్కమ్మీ భూములకు పట్టాలు, జీవో నెంబర్లు 76, 58, 59 ద్వారా పట్టాలు, గృహలక్ష్మి, బీసీ, మైనార్టీ బంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గానికి టీయూఎఫ్ఐడీసీ కింద రూ.100 కోట్ల నిధులను మంత్రి కేటీఆర్ మం జూరు చేశారనీ, రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి గ్రహణం పట్టిందని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మెడికల్ కాలేజీ, సబ్ రిజిస్ర్టార్, కోర్టు భవన సదుపాయం కల్పించినట్లు వివరించారు. దశాబ్ది ప్రగతి సభకు భారీ సంఖ్యలో హాజరై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలపాలని కోరారు. ఆయన వెంట కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, నగర మేయర్ అనిల్‌కుమార్, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, కమిషనర్ నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట్, రాయదండి గ్రామాల్లో 768 ఎకరాల ఖురూజ్కమ్మి భూములు ఉన్నాయి. అయితే, హక్కులు లేక ఈ గ్రామాల ప్రజలు అరవై ఏండ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు. పాలకులు మారినా సమస్య పరిష్కారం కాలేదు. నిజాం పాలనలో జరిగిన తప్పిదానికి ప్రజలు నష్టపోయారు. ఖురూజ్ కమ్మి ఇదెక్కడి పేరు? అసలు ఈ భూములంటే ఏమిటి? అనుకుంటున్నారా..! ఈ ‘ఖురూజ్ కమ్మి’కి అర్థం ఏంటంటే ‘డబ్బులు దొరకని భూములు’!
పెద్దపల్లి, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రామగుండం మండలం రాయదండి, పెద్దంపేటలో 1947లో అప్పటి నిజాం ప్రభుత్వం ఆజమాబాద్ ఇండస్ట్రీస్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని కోసం ఈ గ్రామాల్లోని 1018 ఎకరాల భూములను తీసుకున్నది. అయితే, అప్పుడు బాధితులకు పరిహారం అందలేదు. కాగా, ఈ భూములు ఖురూజ్ కమ్మి భూములుగా నిజాం రికార్డుల్లోకి ఎక్కాయి. అయితే, అప్పుడు సర్వేలతోనే సరిపెట్టి విద్యుత్ ప్లాంటు నిర్మించకుండానే వదిలేశారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూములు ప్రజల ఆధీనంలోనే ఉన్నాయి. కానీ, హక్కు పత్రాలు మాత్రం వారి వద్ద లేవు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత 1963లో ఈ భూముల్లో స్పిన్నింగ్, వీవింగ్ మిల్లులను ఏర్పాటు చేసేందుకు సర్వేలు చేట్టింది. భూ సేకరణ చేయడం ప్రారంభించింది.
1986లో అంతర్గాంలో స్పిన్నింగ్ పరిశ్రమ నెలకొల్పింది. అయితే, అప్పుడు భూసేకరణ చేసినప్పటికీ రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించలేదు. అప్పుటి ప్రభుత్వం పరిహారం డబ్బులను కోర్టులో జమ చేసింది. దాదాపుగా 50 ఎకరాల ఖురూజ్కమ్మి, 46 ఎకరాల పట్టా భూములను తీసుకుంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1995లో బ్రిటీష్ పవర్ లిమిటెడ్(బీపీఎల్) పవర్ ప్లాంట్ కోసం పెద్దంపేట, రాయదండి గ్రామాల్లో భూసేకరణ చేసింది. తమ ఆధీనంలోని ఖురూజ్ కమ్మి భూములను ఇవ్వాలంటే ముందుగా పట్టాలు చేసి, ఆ తర్వాత పరిహారం ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో బీపీఎల్ ఏర్పాటుకు అవసరమైన 200ల ఎకరాల ఖురూజ్కమ్మి భూములకు ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది. అప్పుడు బీపీఎల్ యాజమాన్యం భూములను తీసుకొని ఎకరాకు 16 వేల పరిహారం ఇచ్చింది.
బీపీఎల్ భూసేకరణ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే మిగతా భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని ఈ రెండు గ్రామాల ప్రజలు 2011లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 2013లో రైతులకు పట్టాలు ఇచ్చి భూములపై హక్కు కల్పించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సైతం కనీసం పట్టించుకోలేదు. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కోరుకంటి చందర్ ఖురూజ్ కమ్మి భూముల సమస్య పరిష్కరిస్తానని, రెండు గ్రామాల్లోని ఇండ్లకు, ఇండ్ల స్థలాలకు, వ్యవసాయ భూములకు ప్రభుత్వం నుంచి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఇరు గ్రామాల్లోని వ్యవసాయ భూములకు పట్టాలు లేక పోవడంతో ప్రజలకు ఆరు దశాబ్దాలుగా ఎలాంటి లబ్ధి కలుగడం లేదు. రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పథకాలు అందడం లేదు. గ్రామంలో కట్టుకుంటున్న ఇండ్లకు అనుమతులు లేవు. ఇండ్లు కట్టుకోడానికి సైతం ఎలాంటి రుణాలు రావడం లేదు. ఇలా నానా అవస్థలు పడుతున్న ఈ రెండు గ్రామాల ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకొని గత ప్రభుత్వాల హయాంలో అప్పటి నాయకులు చందాల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులను వసూలు చేసి ప్రజలను నిలువునా ముంచారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక చొరవతో ఈ సమస్యను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేబినెట్ సమావేశంలో నేరుగా సీఎం కేసీఆర్‌కు వివరించారు. సీఎం, వెంటనే స్పందించి, సీఎస్‌ను పిలిచి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించారు.
ఖురూజ్కమ్మీ భూముల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది ఆగస్టు 29న జీవో 127ను జారీ చేసింది. దీని ద్వారా రెండు గ్రామాల్లో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, పెద్దపల్లి ఆర్డీవో మదన్మోహన్, తహసీల్దార్ రామ్మోహన్రావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు రెండు గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేశారు. ఐదెకరాల్లోపు వ్యవసాయ భూములు మోఖాపై ఉన్న వారిని ఎంపిక చేశారు. గ్రామాల్లో రెండుసార్లు ప్రత్యేకంగా ప్రజా వేదికలను ఏర్పాటు చేసి అసైన్మెంట్ చట్టం ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు.
స్వాతంత్య్రానికి పూర్వం నుంచే రాయదండి, పెద్దంపేట ప్రజలు కష్టాలు పడుతున్నారు. కానీ, గతంలో ఇక్కడి నుం చి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడం వల్లే దశాబ్ధాల సమస్యకు పరిష్కారం లభించింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయి లో సర్వేలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. వారందరికీ పట్టాల పంపిణీ చేస్తాం. ఇండ్లు, వ్యవసాయ భూములకు సంబంధించి గ్రామస్తులకు హక్కులు దక్కనున్నాయి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే రామగుండం
అంతర్గాం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామా ల్లో ప్రజలు అనేక సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న భూమి హక్కు ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ జీవో ప్రకారం అర్హులైన వారందరినీ ఎంపిక చేస్తున్నాం. అర్హుల ఎంపికకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తున్నాం. త్వరలోనే మొదటి విడుతగా 550-600 మందికి అసైన్మెంట్ పట్టాలను పంపిణీ చేస్తాం. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీకి అన్ని చర్యలు చేపడుతున్నాం.
-ముజమ్మిల్‌ఖాన్ కలెక్టర్( పెద్దపల్లి)
నిజాం కాలం నుంచి అనేక అవస్థలు పడుతున్నం. మా గోస పట్టిచ్చుకున్నోళ్లు లేరు. మా కన్నీళ్లను చూసినోళ్లు లేరు. ఊళ్లల్లో ఏ భూమి మీద మాకు హక్కు లేదు. కోర్టుల చుట్టూ తిరిగినం. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినం. కానీ, మా బాధ ఎవరూ పట్టించుకోలె. మా కష్టాన్ని, కన్నీళ్లను చూసి ఎమ్మెల్యే చందర్ అన్న చలించి మంత్రి ఈశ్వర్ ద్వారా ప్రభుత్వానికి వివరించిన్రు. ఇన్నేండ్లకు మా బాధలు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
-కరివేద శ్రీనివాస్‌రెడ్డి, రైతు (పెద్దంపేట)
మా గ్రామంలోని ఇండ్లు, వ్యవసాయ భూములకు పట్టాలు కావాలాని మా తాతలు, ముత్తాతల నుంచి కొట్లాడుతూనే ఉన్నం. కానీ, సమస్యను పట్టించుకున్న వాళ్లే లేరు. ఇళ్లు మావే.. కానీ, ఇళ్ల మీద హక్కుండది. పంట మాదే, కానీ ఆ భూమి మీద హక్కుండది. ఆరు దశాబ్దాలుగా సమస్య అలాగే ఉన్నది తప్ప పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం సర్వేలు చేశారు. గ్రామ సభలు పెట్టారు. పట్టాలు వస్తున్నాయని మాకు చాలా సంతోషంగా ఉంది. ఊరు ఊరంతా సంబురపడుతున్నది.
-కొలిపాక శరణ్య, ఎంపీటీసీ (పెద్దంపేట)
అన్ని ఊళ్లల్ల ప్రజల బాధలు వేరు. మా రెండూళ్ల ప్రజల బాధ లు వేరు. పిల్ల పెళ్లి జేద్దామంటే ఇంత భూమి అమ్మి చేసే అవకాశం లేదు. మా చేతుళ్ల భూములు ఉన్నట్టే గానీ వాటిని అమ్ముకునేటందుకు కాగితం లేకపాయె. కతుపలేకపాయె. ఊళ్లల్ల ప్రజలు ఏండ్ల నుంచి ఇబ్బందులు పడుతనే ఉన్నరు. సీఎం కేసీఆర్తోటే ఈ సమస్య పరిష్కారమైతదని అనుకున్నం. అట్లనే అయితంది. సమస్య పరిష్కారానికి ముందటికి అచ్చిన ముఖ్యమంత్రికి మా రెండూళ్ల ప్రజలు రుణపడి ఉంటరు.
-ధర్మాజి కృష్ణ, సర్పంచ్ (రాయదండి)