Ramagundam Baldia | కోల్ సిటీ, అక్టోబర్ 17: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని విద్యా సంస్థలకు నగర పాలక సంస్థ హెచ్చరిక జారీ చేసింది. నగర పాలక పరిధిలో గల అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు షరతులను విధించింది. విద్యా సంస్థలు నడపడానికి కావల్సిన నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్ ఓ సీ) తోపాటు పారిశుధ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
ఈ విద్యా సంవత్సరంనకు సంబంధించి ధృవీకరణ పత్రాలు పొందని విద్యా సంస్థల నిర్వాహకులు నిర్ణీత దరఖాస్తు ఫారం పూరించి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఒక్కో ధృవీకరణ పత్రంకు రూ.10 వేలు రుసుం చొప్పున చెల్లించి నగర పాలక సంస్థ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
ఆ పిదప క్షేత్ర స్థాయిలో పరిశీలించాక సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు. నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించిన సమయంలో చెల్లుబాటులో ఉన్న ఎన్ఓసీ, శానిటేషన్ సర్టిఫికెట్ చూపించకపోతే జరిమానా విధించడంతో పాటు సదరు విద్యా సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యాసంస్థల నిర్వాహకులు సకాలంలో ధృవీకరణ పత్రాలు పొంది నగర పాలక సంస్థకు సహకరించాలని ఆమె కోరారు.