 
                                                            Ramagundam Baldia | కోల్ సిటీ, అక్టోబర్ 31 : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వ్యాపారులతో బల్దియా కార్యాలయంలో సమావేశమై దిశా నిర్దేశం చేసింది. ప్లాస్టిక్ నిషేధానికి సహకరించకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో స్పందించిన వ్యాపారులు నవంబర్ 3 వరకు గడువు ఇవ్వాలని కమిషనర్ ను కోరారు.
కాగా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు కళ్యాణ్ నగర్ వ్యాపారులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి హాజరై నిషేదిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సామగ్రి విక్రయాలు నిర్వహించొద్దని హెచ్చరించారు. ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న అనర్ధాలపై వివరించారు. ఇక మీదట నిషేధంను పకడ్బందీగా నగరంలో అమలు పరుస్తామని స్పష్టం చేశారు.
దీనిలో భాగంగా విస్తృతంగా తనిఖీలు జరుగుతాయనీ, ప్లాస్టిక్ సామగ్రి లభిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యమ్నాయంగా వస్త్రం, జనప నార, కాగితం లాంటి వస్తువులతో తయారు చేసిన వాటిని వినియోగించాలని ఈవిషయమై స్వశక్తి మహిళలు, మెప్మా సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. తమకు మూడు రోజుల గడువు కావాలని వ్యాపారులు హామీపత్రం రాసి ఇచ్చారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మెప్మా టీఎంసీ మౌనిక, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సంవత్, సీనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అనంతరం 53వ డివిజన్ కళ్యాణ్ నగర్ లో తడి, పొడి చెత్తపై ఏకో వారియర్స్ ప్రతినిధులు కరుణాకర్, మహేందర్, జవాన్లు అవగాహన కల్పించారు.
 
                            