Nalla connection | కోల్ సిటీ, ఆగస్టు 8: నల్లా కనెక్షన్లను ఆన్లైన్ నమోదు చేయడంలో రామగుండం నగర పాలక సంస్థ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నగర పాలక సంస్థ కు సంబంధించి 11,472 నల్లా కనెక్షన్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని వంద రోజుల కార్యచరణలో లక్ష్యం విధించగా శుక్రవారం నాటికి 8445 నల్లా కనెక్షన్ వివరాలు విజయవంతంగా నమోదు చేసింది. ఆన్లైన్ ద్వారా నల్లా బిల్లులను చెల్లించే సౌలభ్యంను త్వరలో రామగుండంలో ప్రవేశపెట్టేందుకు చేస్తున్న సన్నాహాలలో భాగంగా వివరాలను ఆన్లైన్ నమోదు చేయడంలో ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే రామగుండం కార్పొరేషన్ మెరుగైన పనితీరు కనబరిచింది.
నగర పాలక సంస్థలో యూఎల్బీ ద్వారా 20,660, అమృత్ పథకం ద్వారా 21,500 కనెక్షన్లతో కలిపి మొత్తం 42,160 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 30,688 నల్లా కనెక్షన్ల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాగా వంద రోజుల ప్రణాళికలో 11,472 నల్లా కనెక్షన్ వివరాలు ఆన్లైన్ నమోదు చేయాలని లక్ష్యం విధించారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలోనే మెరుగైన పనితీరుతో శుక్రవారం నాటికి 8445 నల్లా కనెక్షన్లు నమోదు. చేశారు.
మరో 3027 నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఏకకాలంలో నల్లా బిల్లులు కూడా ఆన్లైన్లోనే వసూలు చేయవచ్చు. వినియోగదారుడు తన స్మార్ట్ ఫోన్ తో ఎక్కడి నుంచైనా బిల్లు చెల్లించే వెసలుబాటు అందుబాటులోకి రానుంది. నగర ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ అరుణ శ్రీ కోరారు.