Trade licenses | కోల్ సిటీ , జూన్ 7: డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు ఫీజులపై రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అవగాహన కల్పించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగర పాలక సంస్థ ఆదాయం పెరిగేందుకు వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న భవనాలను రెసిడెన్షియల్ కేటగిరి నుంచి కమర్షియల్ కేటగిరికి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే లైసెన్సు ఉన్న షాపుల కొలతలను పరీక్షించి సరిగా నమోదు అయ్యాయో, లేదోనని నిర్దారించుకుంటున్నామన్నారు. ట్రేడ్ లైసెన్సు ఆన్లైన్లో పొందే విధానంపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఏలాంటి సందేశాలు వచ్చినా, ఫోన్ కాల్స్ వచ్చినా తక్షణమే స్పందించకుండా తగు విచారణ చేసుకోవాలన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించి నిర్ధారించుకోవాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆర్ఐ శంకర్ రావు, ట్రేడ్ లైసెన్సు ఇన్ఛార్జి సంపత్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, శంకర్ స్వామి, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.