Ramagundam | కోల్ సిటీ, జనవరి 12 : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మొత్తంగా ఒక లక్షా 83వేల 49 ఓటర్లుగా నిర్ధారించారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తుది ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. నగర పాలక పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో 1,83,049 ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుషులు 91,441, మహిళలు 91,578, ఇతరులు 30 మంది ఓటర్లు ఉన్నారని ధృవీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం తుది ఓటరు జాబితాను రూపొందించినట్లు తెలిపారు.
కాగా ఈనెల 1న ముసాయిదా ఓటరు జాబితాను ఇదే కార్యాలయంలో అదనపు కలెక్టర్ అరుణ శ్రీ విడుదల చేయగా, అప్పుడు 1,82,976 మొత్తం ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 91,395మహిళలు 91,551 ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. పది రోజులుగా కార్యాలయంకు వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని సోమవారం తుది ముసాయిదా వెల్లడించగా, అందులో స్వల్పంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. 60 డివిజన్లలో ఒక్కో డివిజన్ కు 2500 నుంచి 3500 వరకు ఓటర్లు ఉండేలా ఈ జాబితాను తయారు చేశారు.
కొన్ని డివిజన్లలో గరిష్టంగా 4వేల ఓటర్లు ఉండేలా తీర్చిదిద్దారు. కాగా ఈ ఓటర్ల ఆధారంగా ఒక్కో పోలింగ్ బూత్ కు 800 ఓటర్ల చొప్పున కార్పొరేషన్లో దాదాపు 230 వరకు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ఆర్ఓ ఆంజనేయులు, ఆర్ఐ లు శంకర్ రావు, ఖాజా, టీపీబీఓలు హిమజ, సిందూజ తదితరులు పాల్గొన్నారు.