కోనరావుపేట, మే 6: రాజీవ్ యువవికాస్ పథకం దరఖాస్తుదారులు తిప్పలు పడ్డారు. మంగళవారం కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూల కోసం బారులు తీరారు. 4లక్షల విలువైన యూనిట్ కోసం మండల వ్యాప్తంగా సుమారు 2700మంది దరఖాస్తు చేసుకోగా, 968 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడ్డారు. కార్యాలయం ఎదుట టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎండలో నిరీక్షించారు.
చెట్ల కింద కొందరు చిన్నపిల్లలతో గంటల తరబడి పడిగాపులు గాశారు. నీటి వసతి కూడా లేదని మహిళలు మండిపడ్డారు. కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రత్యేక కౌంటర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు తాము ఇంటర్వ్యూకు ముందు వచ్చామంటూ ఒకరినొకరు గొడవకు దిగారు. ఏదేమైనా పథకం కోసం దరఖాస్తు చేసుకొంటే ఇంత తిప్పలు ఉంటాయా?అంటూ పలువురు మహిళలు నిరుత్సాహంతో ఇంటికి తిరిగి వెళ్లారు.