Rajanna Temple | వేములవాడ, ఆగస్టు 25 : వేములవాడ రాజన్నకు భక్తిశ్రద్ధలతో భక్తులు సమర్పించిన కోడెలు మృత్యువాత పడుతున్నాయి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెను భక్తులు తమ కోరిన కోర్కెలు తీరిన తరుణంలో ఇంటి నుండి తీసుకువచ్చి నిజకోడెను స్వామివారికి సమర్పించుకునే ఆనవాయితీ ఉంది. అయితే స్వామివారికి భక్తుల ద్వారా సమ కోరిన కోడెలను తిప్పాపూర్ గోశాలలో వాటి నిర్వహణను చూస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో దోమలు ఈగలతో పాటు అపరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండడమే కాకుండా పరిమితికి మించి దాదాపు 500 కు పైగా కోడెలు ఉండడంతో నిత్యం రెండు నుంచి ఐదు కోడెల మృతి చెందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు మృతి చెందుతున్న వాటిని ఎప్పటికప్పుడు సిబ్బంది అధికారుల సమక్షంలో పూడ్చిపెడుతున్నారు. అయితే స్వామివారికి సమర్పించిన కోడెల పర్యవేక్షణ పూర్తిగా విఫలమైనందునే మృత్యువాత పడుతున్నాయని వేములవాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. ఆదాయం మీదే ఉన్న దృష్టి వాటి పర్యవేక్షణ మీద లేదని కోడెల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల తీరు నిరసిస్తూ త్వరలోనే రాష్ట్ర దేవాదాయశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఐదు కోడెల మృతి చెందాయి. కాగా ఆలయ అధికారులు వాటిని గుట్టు చప్పుడు కాకుండా మూలభాగులో ఖననం చేశారు.