కోనరావుపేట : సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలంలోని రెండు గ్రామాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని బావుసాయిపేట గ్రామం రామన్న పల్లెకు చెందిన గుంటి భూమయ్య (62) అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు.
తీవ్ర మనస్తాపానికి గురై గురువారం తెల్లవారుజామున ఇంటిలోనే ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడికి భార్య లచ్చవ్వ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎస్సై ప్రశాంత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతుదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
వివాహిత ఆత్మహత్య
సంచారజీవులుగా గంగిరెద్దులు ఆడిస్తూ జీవనం కొనసాగిస్తున్న బావుసాయి పేట గ్రామ పరిధిలోని రామన్నపల్లె గ్రామానికి చెందిన బత్తుల రేణ( 22) అనే వివాహిత ఉపాధి నిమిత్తం వేములవాడ రూరల్ మండలంలోని నాంపల్లి గ్రామానికి వెళ్లింది. అక్కడ తెల్లవారు జామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త మల్లయ్య మృతి చెందాడు. ఆమె మృతదేహాన్ని రామన్నపల్లె గ్రామానికి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.