Vemulawada : మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి (Rajrajeshawar Swamy) ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఆనవాయితీ ప్రకారం మేడారం వెల్లడానికి ముందు రాజన్నను దర్శించుకునేందుకు భారీగా వచ్చారు. దాంతో.. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం, ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. సోమవారం వేకువజాము నుండే భక్తులు తమ పిల్లలక కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి.. పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం 4 గంటల పాటు క్యూలైన్లలో నిలబడి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
పార్వతీపురం వెనవైపు గల జనరేటర్ గది ముందు నుంచి దారికి అడ్డంగా భక్తులు నిలబడడంతో అటుగా వెళ్లేందుకు పాదచారులకు, ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోడె మొక్కుల కోసం గంటల కొద్దీ వేచి చూశామని.. క్యూ లైన్లలో టాయిలెట్లు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని మహిళా భక్తులు వాపోయారు. స్వామివారికి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఆలయ అధికారులు కనీస వసతులపై దృష్టిసారించడం లేదని మండిపడ్డారు. ఇకనైనా సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని పలువురు అన్నారు.
రాజన్న అనుబంధ దేవాలయాలైన బద్ది పోచమ్మ, నగరేశ్వరాలయాల వద్ద కూడా దర్శనం కోసం భక్తులు బారులు తీరారని అధికారులు తెలిపారు. రాజన్నకు ఆలయంలో పలువురు అభిషేక పూజలు, అన్న పూజలు, ఆకుల పూజలు, గండ దీపం, పల్లకి సేవలు, పెద్ద సేవలు, కల్యాణ మొక్కలు వంటివి నిర్వహించారు. రాత్రి 7 గంటల వరకే రాజన్నను సుమారు 90 వేల మంది దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏఎస్పీ రుత్విక్ సాయి నేతృత్వంలో పట్టణ సీఐ వీర ప్రసాద్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.