రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాన పడింది. ఈ క్రమంలో వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన దాసరి లక్ష్మణ్(26) అనే గొర్రెల కాపరి పిడుగుపాటుతో మరణించాడు.
మధ్య మానేరు ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ప్రతిరోజు ప్రాజెక్టు నుంచి ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ శివారులోకి తన గొర్రెల మందను తీసుకెళ్తుంటాడు. అదే క్రమంలో మంగళవారం గొర్రెల మందను తీసుకొని వెళ్లగా లక్ష్మణ్ పిడుగు పాటు జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.