రాజన్న సిరిసిల్ల : చేనేత పరిశ్రమకు బడ్జెట్లో రూ.371 కోట్లు కేటాయించి నేతన్నను అవమానపరిచిందని సిఐటియు(CITU) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరసన వ్యక్తం చేస్తూ సిఐటియుపవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గురువారం సిరిసిల్ల నేతన్న చౌక్‌లో ప్లకార్డులతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ బడ్జెట్‌ను సవరించి వస్త్ర పరిశ్రమకు రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వం నేతన్నల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని అందిస్తూ వివిధ రకాల పన్నుల రూపకంగా వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయాన్ని గడిస్తున్న చేనేత రంగానికి కేవలం రూ.371 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో గత 15 నెలలుగా సరైన ఉపాధి లేక ఇప్పటికే దాదాపు 30 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ , పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్, పవర్లూమ్ అనుబంధ రంగాల నాయకులు జిందం కమలాకర్, సబ్బని చంద్రకాంత్, బూట్ల వెంకటేశ్వర్లు, గడ్డం రాజశేఖర్, బింగి సంపత్, చింతకింది సుదన్, అడిచర్ల రాజు, సందుపట్ల పోచమల్లు, ప్రభాకర్, దత్తు, తదితరులు పాల్గొన్నారు.