చందుర్తి : యూరియా కొరతతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో అర్ధరాత్రి వరకు మహిళా రైతులు క్యూ లైన్లో నిలుచొని యూరియా కోసం అవస్థలు పడ్డ విషయం మరవకముందే.. చందుర్తిలో చెప్పులతో క్యూలైన్ పెట్టారు. చందుర్తి సహకార సంఘంలో సోమవారం యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే చేరుకొని చెప్పులు క్యూ లైన్ పెట్టారు.
జిల్లాలో ఎరువుల కొరత లేదని ఒకవైపు అధికారులు ప్రకటనలు ఇస్తుండగానే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఒక ఎకరానికి ఒకే బస్తా యూరియా మాత్రమే ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బంది పడుతూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం, మండలంలో ఎరువుల కోసం రైతుల అవస్థలు పడుతుండటం గమనార్హం.