రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. నీళ్లులేక, కరెంట్ రాక, పెట్టుబడి సాయం అందక రైతులు చేసిన అప్పులు తీర్చే మార్గంలేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన కౌలు రైతు జెల్లా దేవయ్య(51) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జెల్లా దేవయ్య గ్రామానికి సమీపంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని అందులో వరి పంట సాగు చేశాడు. వరి సాగుకు నీరు అందక ఎండిపోవడంతో ఆందోళనకు లోనయ్యాడు. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీరుతాయని తెలియక మనస్థాపానికి గురై పురుగుల మందుతాగి మరణించాడు. మృతుడికి భార్య పద్మ, కూతురు రేఖ, కొడుకు అజయ్ ఉన్నారు. దేవయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.