రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్వో)ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల గ్రూపులో ఓ కార్టూన్‌ను పోస్టు చేసిన విషయం వివాదాస్పదం కావడమే ఈ సస్పెన్షన్‌కు కారణమైంది. ‘డియర్ విప్ ఆది శ్రీనివాస్ గారు.. సీఎం నా పనితనాన్ని గుర్తించాడు. నేనిక్కడే ఉంటా.. అవినీతి అక్రమాల భరతం పడుతా.. పైరవీలు నన్ను తొలగించలేవు’ అని పేర్కొంటూ చిత్రికరీంచిన ఓ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఆ కార్టూన్ పోస్టును డీపీఆర్వో శ్రీధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల గ్రూపులో స్వయంగా పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఇది అన్ని గ్రూపుల్లో వైరల్‌గా మారడంతో ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా.. డీపీఆర్వోను సెస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక బాధ్యాతాయుతమైన పొస్టులో ఉండి అసంబద్ధ కార్టూన్‌ను పోస్టు చేయడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని, అలాగే మరి కొన్ని కారణాలను సస్పెన్షన్ లేఖలో పేర్కొన్నారు.
విధి నిర్వహణ సరిగ్గా నిర్వర్తించడం లేదని, వివిధ సమూహాల మధ్య ఘర్షణను సృష్టిస్తున్నారని తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ వ్యక్తి గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే కాకుండా, గతంలోనూ పలు సమస్యలను సృష్టించాడని, అందుబాటులో ఉన్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కేసు పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సవిల్ సర్వీసెస్ నిబంధనలు, 1991చట్టంలోని నిబంధన-8లోని ఉప-నియమం(1) ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఆయన అధికారిక మొబైల్ సిమ్‌ను కలెక్టరేట్లోని ఏవోకు అప్పగించాలని ఆదేశించారు. తర్వాత ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎఫ్ఆర్-53 కింద జీవనాధార భత్యం పొందేందుకు అర్హులని లేఖలో పేర్కొన్నారు. సస్పెన్షన్ లేఖను అమోదించాలని కమిషనర్ ఐఅండ్‌పీఆర్ పంపించారు. డీపీఆర్వో సస్పెన్షన్ కావడం కలకలం రేపుతున్నది.