సిరిసిల్ల టౌన్, జూలై 7: ఉపాధికి ఊతమిచ్చి.. జీవితాలకు భరోసా నిస్తున్న సీఎం కేసీఆర్‌కు నేత కార్మికులు జై కొట్టారు. నేత కార్మికులకు బీమా సౌకర్యం.. పద్మశాలీ ట్రస్టుకు ఐదెకరాల స్థలంతోపాటు భవన నిర్మాణానికి 5కోట్లు మంజూరు, కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల 4న సిరిసిల్ల వేదికకగా సీఎం ప్రకటించడాన్ని స్వాగతిస్తూ పద్మశాలీ సంఘం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కృతజ్ఞతగా భారీ ర్యాలీ తీశారు. స్థానిక కొత్తబస్తాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా నేతన్న చౌరస్తా దాకా ర్యాలీ కొనసాగింది. వందలాది మంది పద్మశాలీలు, నేతన్నలతో దారులన్ని నిండిపోయాయి. ముందుగా కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పార్టీలకతీతంగా తరలివచ్చిన నేతలు మహానేతకు నీరాజనం పలికారు. దారి వెంట ‘జై కేసీఆర్.. జైజై కేటీఆర్’ అంటూ నినదిస్తూ నృత్యాలు చేశారు. అనంతరం స్థానిక పాతబస్టాండ్‌లోని నేతన్న విగ్రహానికి పూల మాల వేసి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనసున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్మికక్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను అందించిన నేతన్నల జీవనస్థితిగతుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఒకప్పుడు ఆకలిచావులతో ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల నేడు సిరుల‘ఖిల్లా’గా వర్దిల్లుతోందని అభివర్ణించారు. సిరిసిల్ల వేదికగా సీఎం ప్రకటించిన వరాలు ప్రకటించడం పద్మశాలీ సామాజిక వర్గ అభివృద్ధికి వారు చేస్తున్న కృషికి నిదర్శనంగా పేర్కొన్నారు. రైతు బీమా తరహాలో నేత కార్మికులకు 5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి కార్మికుల జీవితాలకు కొండంత ధీమాను కల్పించారన్నారు. చరిత్రలో లేని విధంగా పద్మశాలీ సామాజికవర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్‌లకు జీవితకాలం రుణపడి ఉంటామని ప్రతినబూనారు.
ఇక్కడ టీఆర్ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధానకార్యదర్శి మ్యాన రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, ప్రధానకార్యదర్శి దిడ్డి రాజు, పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ, యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్, కట్టెకోల లక్ష్మీనారాయణ, మండల సత్యం, అన్నల్దాస్ అనీల్, బీజేపీ పట్టణాధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, రాజన్న సిరిసిల్ల పవర్‌లూం మ్యాక్స్ ప్రెసిడెంట్స్ అసోసియేషన్, జిల్లా పవర్‌లూం మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.