ఓదెల, జూలై 6: రైల్వే గేట్లస్థానంలో కొన్నిచోట్ల అండర్ బ్రిడ్జిలు, మరికొన్ని చోట్ల ఆర్వోబీలను (రైల్వే ఓవర్ బ్రిడ్జి) రైల్వేశాఖ నిర్మిస్తున్నది. ఏండ్ల తరబడి పనులు కొనసాగుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు తప్పడంలేదు. అలాగే కాజీపేట-బల్లార్షా సెక్షన్లో రైళ్ల రద్దీ కారణంగా రైల్వేశాఖ ఇటీవల మూడో లైన్ నిర్మాణం చేపట్టింది. దీంతో రైళ్ల రాకపోకలు గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి.
ఈ క్రమంలో మూడు, నాలుగు రైళ్లు అప్ అండ్ డౌన్ వెళ్తే గానీ గేట్ తీయడం లేదని, ప్రతి గేట్ వద్ద 30నుంచి 40నిమిషాల వరకు వేచిఉండాల్సి వస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద కూడా దాదాపు అరకిలో మీటర్ మేర వాహనాలు బారులు తీరుతున్నాయని చెబుతున్నారు. రైల్వేగేట్లు తమకు శాపంగా మారాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ స్పందించి ఆర్వోబీలను వెంటనే నిర్మించాలని వారు కోరుతున్నారు.