ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం.. ఇక్కడ భయం భయం
అక్కడే చిక్కుకున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు
ఆందోళనలో కుటుంబ సభ్యులు
చిక్కుకున్న వాళ్లలో చాలా మంది మెడికోలే..
ఇండియన్ ఎంబసీ పట్టించుకోవడం లేదని కొందరు విద్యార్థుల ఆందోళన
బంకర్లలో ఉంచారంటున్న శిరీష
ఆఖరి ఫ్లైట్‌లో హైదరాబాద్ చేరుకున్న రాహుల్‌రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్/ రామడుగు/ సైదాపూర్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దళాలు చేస్తున్న దాడులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెన్షన్ మొదలైంది. అక్కడి వివిధ కళాశాలల్లో మెడిసిన్ చదువు కోసం వెళ్లిన చాలా మంది అక్కడే చిక్కుకోగా ఏ క్షణం ఏమవుతుందోనన్న ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది. అక్కడి ఏ మెడికల్ కళాశాలలో చూసినా తెలుగు వాళ్లు వందల సంఖ్యలో ఉండగా, ఉమ్మడి జిల్లాకు చెందిన వారు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోని వనిస్తియా, జఫ్రోజియా, తదితర రాష్ర్టాల్లోని మెడికల్ కాలేజీల్లో జిల్లాకు చెందిన చాలా మంది మెడిసిన్ చదువుతుండగా, ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నప్పటికీ ఏ క్షణంలో ఏమవుతుందోనన్న భయం అక్కడున్న వారిలో కనబడుతోంది. తమ పిల్లల క్షేమాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న తల్లిదండ్రుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులు తలెత్తడం ఉమ్మడి జిల్లాలో గుబులు రేపుతోంది. ఇక్కడి నుంచి అనేక మంది విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు వెళ్లగా, పదుల సంఖ్యలో అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి వనిస్తియా రాష్ట్రం నుంచి గొట్టం శిరీష అనే కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థిని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా, కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లికి చెందిన మూల రాహుల్‌రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఇతనితో జఫ్రోజియాలో చదువుకున్న 25 మంది భారతీయ విద్యార్థులు ఇదే ఫ్లైట్‌లో సురక్షితంగా ఇండియాకు వచ్చినట్లు చెప్పారు. కాగా, రామగుడు మండలం రాంంచంద్రాపూర్కు చెందిన కడారి సుమాంజలి రష్యా దళాలు దాడులు చేస్తున్న ఉక్రెయిన్ రాజధాని కివ్‌లో చిక్కుకుంది. ఆమెను తిరిగి జఫ్రోజియాకు పంపిస్తున్నట్లు అక్కడి అధికారులు చెప్పినట్లు ఆమె తల్లి దండ్రులు చెబుతున్నారు. సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లి సర్పంచ్ వీరమల్ల రవీందర్‌రెడ్డి కొడుకు సాయినాథ్‌రెడ్డి, ఎక్లాస్పూర్కు చెందిన ఆవుల కుమారస్వామి కూతురు మానస, హుజూరాబాద్‌కు చెందిన కర్ర నిఖిల్‌రెడ్డి, కందుగులకు చెందిన కేసిరెడ్డి విజయసాయిరెడ్డి, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీడీ కాలనీకిచెందిన తూముల భవానీ, మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన బద్ధం కిషన్‌రెడ్డి కూతురు నిహారిక చిక్కుకోగా, వారు సురక్షితంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉక్రెయిన్‌లో ఆందోళన చెందుతున్నారు. అక్కడ చిక్కుకు పోయిన వారిలో చాలా మంది మెడిసిన్ చదివేందుకు వెళ్లిన వాళ్లే. ఉక్రెయిన్ వ్యాప్తంగా అనేక మెడికల్ కళాశాలల్లో తెలుగు వాళ్లు, జిల్లాకు చెందిన వాళ్లు ఉన్నారని, ఇక్కడి తల్లిదండ్రులు చెబుతున్నారు. వాళ్లను ఎలాగైనా సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడి ఇండియన్ ఎంబసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకర పరిస్థితుల్లో తమ పిల్లలు చిక్కుకొని ఉంటే కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఎంబసీపై కోపంతో కనిపిస్తున్నారు.
చాలా భయంగా ఉంది..
కరీంనగర్‌లోని కట్టరాంపూర్‌కు చెందిన గొట్టం అమరేందర్‌రెడ్డి కూతురు శిరీష ఉక్రెయిన్‌లోని వనిస్తియా స్టేట్ మెడికల్ కళాశాలలో సెకండ్ ఇయర్ మెడిసిన్ చదువుతోంది. ఈ నెల 9న ఇండియాకు తిరిగి రావాలని తండ్రి అమరేందర్‌రెడ్డి చెప్పినా ఆమె అక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయని చెప్పింది. తనతోపాటు చాలా మంది ఉన్నారని, ఎలాంటి భయం లేదని చెప్పింది. కానీ, ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా కాస్త భయాన్ని వ్యక్తం చేసింది. ఆమె మాటల్లోనే..
‘మేం ఉక్రెయిన్ రాజధాని కివ్కు 250 నుంచి 300 కిలో మీటర్ల దూరంలో ఉంటాం. మేమున్నది వనిస్తియా రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల. ఇక్కడ నాతోపాటు తెలుగు వాళ్లు దాదాపు 200 మంది మెడిసిన్ చదువుకుంటున్నారు. ఈ రోజు మార్నింగ్ లేచే సరికి ఇక్కడంతా డిఫరెంట్ సిచ్వేషన్ కనిపించింది. యుద్ధం జరుగుతుందని చెప్పడంతో మేమంతా హాస్టల్ నుంచి ఏటీఎంల వైపు పరుగులు తీశాం. సీటీలో ఏ ఏటీఎం వద్ద చూసినా చాలా మంది క్యూ లైన్లలో కనిపించారు. నాలుగైదు ఏటీఎంల వద్దకు వెళ్లినా ఇదే పరిస్థితి. మొత్తం మీద పది రోజులకు సరిపడా డబ్బు తీసుకుని హాస్టల్‌కు వెళ్లాం. ఉదయం నుంచే హాస్టల్ పరిసరాల్లో మిల్ట్రీ వాళ్లు, పోలీసులు తిరుగుతున్నారు. భయటకు వెళ్లవద్దని మా హాస్టల్ వాళ్లు చెప్పారు. సాయంత్రం మమ్మల్ని హాస్టల్‌కు సమీపంలో ఉన్న బంకర్లకు తీసుకెళ్లి సెల్టర్ ఇచ్చారు. ఇప్పుడు మేమంతా ఇక్కడే ఉన్నాం. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి ఉంది. మధ్యాహ్నం మాకు బాంబుల శబ్ధాలు కూడా వినిపించాయి. అవి ఎక్కడ పడుతున్నాయో కూడా తెలియదు. సమాచారం తెలుసుకుందామంటే టీవీలు అందుబాటులో లేవు. ఫోన్లు ల్యాబ్ట్యాబుల్లో చూస్తున్నాం. ఇక్కడ ఇండియన్ ఎంబసీ ఉన్నట్లేకాని పట్టింపు లేదు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. పరిస్థితి భయంగానే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫోన్ చేసి మేమే ధైర్యం చెబుతున్నాం.
సుమాంజలి పరిస్థితి దారుణం
జఫ్రోజియా యూనివర్సిటీలోనే చదువుకుంటున్న రామడుగు మండలం రాంచంద్రాపూర్‌కు చెందిన కడారి సమాంజలి ఇండియాకు రావడానికి టికెట్ బుక్ చేసుకుంది. గురువారం ఉదయం కివ్కు చేరుకుంది. కానీ, అక్కడ రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసేశారు. ఆమె ఉండే జఫ్రోజియాలో ఉన్నా బాగుండేదని సుమాంజలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిఫ్త్ ఇయర్ మెడిసిన్ చదువుతున్న తమ కూతురు ఒక్క రోజు ముందుగా బయలుదేరినా ఇండియాకు చేరేదని వాపోతున్నారు. అయితే, కివ్‌లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఆమెను జఫ్రోజియాకు తిరిగి పంపుతామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ చేరుకున్న రాహుల్
కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లికి చెందిన మూల రాహుల్ చాలా లక్కీ. జఫ్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ చదువుతున్న అతను ఈ నెల 23న టర్కీ ఎయిర్‌లైన్ ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్నాడు. రష్యా దాడి చేసిన ఉక్రెయిన్ రాజధాని కివ్ ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం 9 గంటలకు టర్కీ ఎయిర్ లైన్ విమానం ఎక్కి ఇస్తంబుల్, మస్కట్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాహుల్ రెడ్డిని అతని తల్లిదండ్రులు మూల రవీందర్‌రెడ్డి రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తాను 23న టికెట్ బుక్ చేసుకున్నానని, ఉక్రెయిన్ నుంచి తాను వచ్చిన ఫ్లైటే ఆఖరిది అనుకుంటున్నానని చెప్పాడు. తాను చదివే యూనివర్సిటీలో తనతోపాటు చదువుకునే సీనియర్స్, జూనియర్స్ సుమారు 25 మంది ఇదే ఫ్లైట్‌లో ఇండియాకి వచ్చారని, తెలుగు వాళ్లు ఒక ఐదుగురు ఉన్నారని తెలిపాడు. తన కొడుకు సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంతో రాహుల్ తండ్రి రవీందర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు.
26న వచ్చే వారు
వనస్తియాలో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతున్న పున్నం శ్రీశాంత్ నవంబర్‌లో అక్కడికి వెళ్లాడు. మే 1 వరకు ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతాయని మేనేజ్మెంట్ మెస్సేస్ చేయడంతో వెళ్లిన శ్రీశాంత్, అక్కడ యుద్ధం జరుగుతుందని తెలిసిన తండ్రి రాజు ఇంటికి రప్పించేందుకు ఈ నెల 26న ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేశారు. కానీ, ఇంతలోనే యుద్ధం మొదలు కావడంతో అక్కడ శ్రీశాంత్, ఇక్కడ ఆయన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
యుద్ధం వస్తుందని ముందే చెప్పా
ఉక్రెయిన్‌లో ఉంటున్న నా బిడ్డకు యుద్ధం వస్తుందని ముందే చెప్పా. కానీ, అక్కడ ఎలాంటి ఆందోళన లేదని మా బిడ్డనే కాకుండా ఆమెతో చదువుకుంటున్న వాళ్లు చెప్పారు. కానీ, ఇప్పుడు యుద్ధం వచ్చింది. అయినా, ఎలాంటి ఆందోళన లేదని చెబుతున్నారు. కానీ, నాకు మాత్రం ఆందోళనగానే ఉంది. ఇండియన్ ఎంబసీ తక్షణం కల్పించుకుని అక్కడి విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలి.
– గొట్టం అమరేందర్‌రెడ్డి, శిరీష తండ్రి