Rag pickers protest | కోల్ సిటీ, అక్టోబర్ 8: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ర్యాగ్ పిక్కర్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తాము మనుషులమేననీ, చెత్త సేకరణ విధులతో పాటు అదనంగా రోడ్లు ఊడ్చడం, ఇతర పనులు చెబుతూ సూపర్వైజర్లు వేధింపులకు గురి చేస్తున్నారని ఏకరువు పెట్టారు.
యూనియన్ సెక్రెటరీ ఎంఏ గౌస్ మాట్లాడుతూ నగర పాలక పరిధిలో ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ చేసే ర్యాగ్ పిక్కర్ కార్మికులను తరచుగా డివిజన్లు మారుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. పారిశుధ్య కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెత్త సేకరణకు నియమించిన ర్యాగ్ పిక్కర్లతో ఇతర పనులు కూడా చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని సూపర్వైజర్ల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో 202 మంది ర్యాగ్ పిక్కర్లకు ప్రస్తుతం 125 మందికి మాత్రమే పని చేస్తున్నారనీ, వీరి సంఖ్యను ఎప్పటిలాగే పెంచి పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కమిషనర్, మారుతి ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు.