కరీంనగర్ కార్పొరేషన్/ విద్యానగర్, జనవరి 2 ;పెట్రోల్ బంకులు కిక్కిరిశాయి. వాహనదారులు ఒక్కసారిగా రావడంతో రద్దీగా మారిపోయాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రోడ్డు యాక్సిడెంట్ చట్టం(హిట్ అండ్ రన్)ను నిరసిస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సోమవారం నుంచి హైదరాబాద్‌లో సమ్మెకు దిగారు. అయితే ఎక్కడికక్కడ ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోవడంతో మంగళవారం ఉదయం నుంచే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. ఈ వార్తలు టీవీల్లో రావడం, వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడడంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం ఫిల్లింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. రాత్రయినా లైన్లల్లో వేచి ఉన్నారు. యాసంగి వరినాట్ల సీజన్ కావడంతో ట్రాక్టర్ల డ్రైవర్లయితే పెద్ద పెద్ద క్యాన్లతో బంకులకు వచ్చి 100 నుంచి 200 లీటర్ల డీజిల్‌ను తీసుకెళ్లడం కనిపించింది. అయితే రాత్రి సమ్మె విరమించినట్లు ప్రకటించగా, అంతా ఊపిరి పీల్చుకున్నారు.