కమాన్చౌరస్తా, జనవరి 28 : ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన ‘ఫెరియో ఫీస్టా’ సోషల్ సైన్స్ ప్రదర్శనలను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి ప్రారంభించారు. ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణాన్ని సందర్శించేలా చూడాలని బాలికల అభివృద్ధి అధికారి కృపారాణిని ఆదేశించారు. ఈ ప్రదర్శనలను పెద్ద ఎత్తున జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు తిలకించారు. ఫన్ గేమ్స్, పజిల్స్, మెదడుకు మేత వంటి వివిధ ఆటలు విద్యార్థులను ఆకర్షించాయి. ఈ సందర్భంగా కళాశాలలో మెడ్ కవర్ హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ క్యాంపు నిర్వహించారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ విభాగం తరఫున విద్యార్థినులు 40 రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థినులకు పాటలు, నృత్య పోటీలు నిర్వహించగా, విజేలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డీ వరలక్ష్మి అధ్యక్షత వహించగా, ప్రిన్సిపాల్ టీ భాగ్యలక్ష్మి, ఎన్సీసీ డాక్టర్ లెఫ్టినెంట్ ఆయేషా షేక్, ఫెరియా ఫీస్టా కన్వీనర్ డాక్టర్ ఆర్ మొగిలి, కోఆర్డినేటర్స్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
కార్పొరేషన్/ కలెక్టరేట్, జనవరి 28 : భూక్రమబద్ధీకరణ పథకంలో పెండింగ్లో ఉన్న 2020 దరఖాస్తులు వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులపై నీటిపారుదల, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దరఖాస్తులు అధికంగా ఉన్న గ్రామాల్లో అదనపు సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్, రూరల్, కొత్తపల్లి మున్సిపాలిటీ, కొత్తపల్లి మండల పరిధిలోని దరఖాస్తులు పరిశీలించేందుకు అదనంగా తొమ్మిది మంది సిబ్బందిని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
కమాన్చౌరస్తా, జనవరి 28 : జిల్లా వ్యాప్తంగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దిశ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని కస్తూర్బా బాలికల పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ పాఠశాలలో కొనసాగుతున్న దిశ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు.