Ration card | కోల్ సిటీ, సెప్టెంబర్ 12 : ‘హలో… నేను ఎమ్మార్వో ఆఫీస్ నుంచి వచ్చాను.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంది మీరేనా.. ఎంక్వయిరీకి వచ్చాము మీరుండే అడ్రస్ ఎక్కడ… లేదంటే మేము ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం.. ఆధార్ కార్డు, కరెంటు బిల్లు జిరాక్స్ లు తీసుకొని ఇక్కడకి రండి..’ అంటూ గోదావరిఖనిలో పలువురు దరఖాస్తు దారులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రేషన్ కార్డు విచారణ అనగానే.. పాపం.. ఆగమేఘాల మీద వారు చెప్పిన చోటకు వెళ్లిన వారికి అక్కడ కొర్రీలు ఎదురవుతున్నాయి.
మీకు రేషన్ కార్డు రావాలంటే ఏలాంటి విచారణ లేకుండానే మేము చెప్పినట్టు వింటే రెండ్రోజుల్లో కార్డు మీ చేతుల్లో ఉంటుంది అని చెబుతున్నారు. అందుకోసం ముందు రూ.2 వేలు… కార్డు వచ్చాక మరో రూ.వెయ్యి.. మొత్తం రూ.3వేలు ఇచ్చారంటే.. రేషన్ కార్డు తొందరగా వస్తుంది. ఈ నెలలోనే మీరు రేషన్ షాప్ కు వెళ్లి సన్న బియ్యం తీసుకోవచ్చు.. లేదంటే మరో ఐదేళ్ల దాకా రేషన్ కార్డు రాదు… ఆరోగ్య శ్రీ, సన్నబియ్యం, ఉచిత కరెంటు ఇవన్నీ కోల్పోవడం అవసరమా…? అని ప్రలోభ పెడుతున్నట్లు తెలిసింది.
నేరుగా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఈ తతంగం అంతా నడిపిస్తున్నది రామగుండం రెవెన్యూ ఉద్యోగి అని బాహాటంగా ప్రచారం జరుగుతోంది. గత వారం రోజుల నుంచి గోదావరిఖని పరశురాంనగర్ కు వచ్చి దరఖాస్తు దారులకు ఫోన్ చేసి ఇదే తరహాలో తాను ఎమ్మార్వో ఆఫీసు నుంచి వచ్చాననీ పలువురికి ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు తెలిసింది. అక్కడకు వెళ్లగానే మరో వ్యక్తి ఫోన్ చేసి రూ.3 వేలు ఇస్తే మీ పని తేలికగా అయిపోతదంటూ పలువురి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.
కాగా, సదరు రెవెన్యూ ఉద్యోగిగా చెప్పుకుంటున్న వ్యక్తి రేషన్ కార్డు మంజూరైన లబ్దిదారుల లిస్టు తీసుకొని గోదావరిఖని పరశురాంనగర్ కు వచ్చి వారిని తన వద్దకు పిలిపించుకొని బేరాలు ఆడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. న్యాయంగా రావల్సిన రేషన్ కార్డుకు డబ్బులు ఇవ్వడం ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జవహర్ నగర్ ఏరియాలో ఓ ఆర్ఎంపీ క్లినిక్ లో నే ఈ వ్యవహారం నడుస్తున్నట్లు వినికిడి.
ఇదే ఆసరాగా అనర్హులు సైతం అడిగినంత డబ్బులు ఇచ్చి రేషన్ కార్డులు పొందే అవకాశం లేకపోలేదు. కొందరు సింగరేణి కార్మికులు సైతం ఇదేవిధంగా దళారులకు డబ్బులు ఇచ్చి కార్డులు పొందినట్లు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ చేతివాటంలో రెవెన్యూ అధికారులకూ ఏమైనా వాటాలు ఉన్నాయా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
తప్పకుండా చర్యలు తీసుకుంటాం.. : శ్రీపాద ఈశ్వర్, తహసీల్దార్, రామగుండం
వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. రేషన్ కార్డు ఇప్పిస్తామని ఎవరైనా ఉద్యోగి అంటూ మీ వద్దకు వచ్చి డబ్బులు లంచంగా అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తక్షణమే చర్యలు తీసుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సమగ్రంగా విచారణ ప్రక్రియ పూర్తి చేశాకే రేషన్ కార్డులు అందజేస్తున్నాం. మధ్య వర్తులు గానీ, ఉద్యోగి అంటూ వచ్చి డబ్బులు అడిగేవారి గురించి సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగానే ఉంచుతాం.