మన దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ)కు రోజురోజుకూ డిమాండ్ ఏర్పడుతున్నది. ఈ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉండడం, చిన్న కంపెనీల నుంచి ప్రపంచ దిగ్గజ కంపెనీల వరకు వాటి వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరి పాత్ర కీలకం కావడంతో సీఏ కోర్సుపై యువతలో ఆసక్తి పెరుగుతున్నది. నిజానికి ఇది కష్టసాధ్యమైన కోర్సు అయినప్పటికీ కష్టపడితే మంచి ఫలితాలుంటాయి. అవకాశాలు మనల్నే వెతుక్కుంటూ వస్తాయి. ఇంకా వృత్తిలో రాణిస్తే.. మనమే పది మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలుంటాయి. అయితే సీఏ చేయాలనుకునే యువతతోపాటు చేస్తున్న వారికి కరీంనగర్ ఐసీఏఐ బ్రాంచ్ అండగా నిలుస్తున్నది. నేడు నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌డే (బుధవారం) సందర్భంగా.. సాధారణ కోర్సులకు భిన్నంగాసాగే సీఏ కోర్సుకు ఉన్న ఉపాధి అవకాశాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాలతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం అందిస్తున్నది.
కరీంనగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ విద్యానగర్ : దేశంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ వృత్తిని ప్రోత్సహించేందుకు పార్లమెంట్ చట్టం ద్వారా 1949 జూలై 1న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) స్థాపించారు. ఈ సంస్థ ఏర్పాటైన రోజునే ఏటా నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే నిర్వహిస్తున్నరు. అయితే.. మన దేశంలోని సీఎలు అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించిన ఆడిట్లను నిర్వహిస్తుండడంతో ఇండియా ఒక హబ్‌గా మారుతున్నది.
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడంతో రాబోయే రోజుల్లో సీఏలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడనున్నది. నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే ఇరవై ఏళ్లలో దాదాపు 30 లక్షల మంది సీఏలు అవసరమని వివిధ సర్వే గణంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 4 లక్షల మంది మాత్రమే అర్హత ఉన్న సీఏలు అందుబాటులో ఉండగా, దీంతో మంచి నైపుణ్యాలున్న వారికి కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్తు ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే.. హైదరాబాద్‌లో వారికి డిమాండ్ అపారంగా ఉన్నది. ఐటీ, ఫార్మా, మల్టీ నేషనల్ కంపెనీలు, కార్పొరేట్ ఆఫీస్‌లు ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలతో పాటు పెద్ద పెద్ద ఫార్మాసూటికల్ కంపెనీలు పెద్ద సంఖ్యలో సీఏలను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో సీఏ ఫ్రెషర్స్ వార్షిక వేతనం దాదాపు రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యాలను బట్టి ఇది సంవత్సరానికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందుతుంది. ఈ పరిస్థితుల్లో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కోర్సుపై యువత ఆసక్తి చూపుతున్నది. ఈ కోర్సు చేయడం కష్టమే అయినా.. భవిష్యత్ కోసం కోర్సును తీసుకుంటున్నది. నిజానికి ఇది డిమాండ్‌తో కూడుకున్న వృత్తియే కాదు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భద్రతనిచ్చే వృత్తిగా భావిస్తున్నారు.
డిజిటల్ ఫైనాన్స్, బిజినెస్ గ్రోత్, స్ట్రాటజిక్ ఫైనాన్స్ వంటి రంగాల్లో నైపుణ్యం పెరుగుతుండడంతో యువతీయువకులు ఈ కోర్సులపై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి దేశంలో ప్రాక్టీస్ చేస్తున్న సీఏలలో దాదాపు 50శాతం మందికి పైగా 30 ఏళ్ల లోపు వారే ఉన్నారు. సీఏ పూర్తి చేసిన వారికి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలతోపాటు స్వయం ఉపాధి (ప్రాక్టీస్)లో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీరు స్థిరపడేందుకు మార్కెట్లో అనేక రంగాలున్నాయి.
ఆడిటింగ్ అండ్ టాక్సేషన్, కంపెనీల ఫైనాన్షియల్ లెక్కలు, పన్నుల నిర్వహణ చూడడం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కంపెనీ ఆర్థిక స్థితిగతులను పర్యవేక్షించడం, ఇన్వెస్టమెంట్ ప్లానింగ్ చేయడం కోసం రిక్రూట్ చేస్తున్నాయి. కంపెనీల్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ , ఫైనాన్స్ డైరెక్టర్, బిజినెస్ కన్సల్టెంట్ వంటి అత్యున్నత స్థాయి బాధ్యతలను కూడా చేపట్టవచ్చు. ఇది కాకుండా స్వయం ఉపాధిలో భాగంగా కన్సల్టెన్సీ లేదా ఆడిట్ ఫర్మ్‌ను ప్రారంభించి ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
పన్నులకే పరిమితంకాని సీఏలు
చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆడిట్లు, బ్యాంకు ఆడిట్లు, జీఎస్టీ, ఆదాయపు పన్ను, కంపెనీ చట్టాలు, బ్యాంకింగ్ కంప్లయెన్స్, ప్రాజెక్ట్ రిపోర్టులు, సీఎంఏ డేటా, ఆర్థిక ప్రణాళిక, కార్పొరేట్ గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, విలీనాలు, స్టార్టప్‌లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు. సహకార సంఘాలు, డిజిటల్ కంప్లయెన్స్ వంటి అనేక రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025తో సీఏల బాధ్యతలు మరింత పెరిగాయి.
జీఎస్టీ అమలు తర్వాత దేశంలో పన్ను వ్యవస్థ పూర్తిగా డిజిటల్‌గా మారింది. ఇప్పుడుకొత్త ఆదాయపు పన్ను చట్టం-2025, ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్, డిజిటల్ అకౌంటింగ్, ఎంసీఏ ఫైలింగ్స్, వంటి కొత్త విధానాలతో ప్రతి పరిశ్రమకు నిపుణులైన చార్టర్డ్ అకౌంటెంట్ల అవసరం మరింత పెరిగింది. రాబోయే కాలంలో ఈ డిమాండ్ మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అండగా నిలుస్తున్న కరీంనగర్ బ్రాంచ్
ఐసీఏఐ కరీంనగర్ బ్రాంచ్ ఔత్సాహిక యువతీయువకులకు అండగా నిలుస్తున్నది. 2012 జనవరి 29న స్థాపించిన ఈ బ్రాంచ్, ఉత్తర తెలంగాణలకు తలమానికంగా మారింది. 103 మంది సభ్యులతో ప్రారంభమై, ప్రస్తుతం 640 మంది సీఏ సభ్యులకు సేవలందిస్తున్నది. అంతేకాదు, ఉమ్మడి జిల్లా నుంచి సీఏ అభ్యసిస్తున్న సుమారు 1200 మందికిపైగా విద్యార్థులకు సపోర్టుగా ఉంటున్నది. గతంలో విద్యార్థులు సీఏ పరీక్షలు రాయడానికి హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది.
ప్రస్తుతం కరీంనగర్‌లోనే ఐసీఏఐ అధికారిక పరీక్షా కేంద్రం అందుబాటులోకి రావడంతో సమయం, ప్రయాణ వ్యయం తగ్గింది. విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, మాక్ టెస్టులు, రివిజన్ క్లాసులు, స్టడీ సర్కిల్స్, కెరీర్ గైడెన్స్, ఓరియంటేషన్ కార్యక్రమాలు, సాంకేతిక శిక్షణ, కొత్తగా అర్హత సాధించిన చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రాక్టిస్ మేనేజ్మెంట్, ప్రొపెషనల్ ఎథిక్స్, ఇంకా వృత్తిపరమైన అంశాలపై కరీంనగర్ బ్రాంచ్ నిరంతరం శిక్షణ ఇస్తున్నది. ఇక్కడితో ఆగకుండా ఈ బ్రాంచ్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నది.
ఆర్థిక సాక్షరత కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ అవగాహన సదస్సులు, మహిళా సాధికారత కార్యక్రమాలు, యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి చేరవవుతున్నది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటి వరకు 640 మంది చార్టర్డ్ అకౌంటెంట్లుగా అర్హత సాధించగా, అందులో సుమారు 150 మంది మాత్రమే స్వతంత్రంగాప్రాక్టీస్ చేస్తున్నారు. మిగిలిన వారు దేశ, విదేశాల్లోని ప్రముఖ బ్యాంకులు, బహుళజాతి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ కంపెనీల్లో ఉన్నత పదవుల్లో సేవలందిస్తున్నారు.
దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
చార్టర్డ్ అకౌంటెంట్ అంటే కేవలం పన్ను నిపుణుడు మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు విశ్వసనీయతను అందించే వృత్తి నిపుణుడు కూడా. ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించడం, పరిశ్రమలకు ఆర్థిక మార్గదర్శకత్వం అందించడం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కాపాడడం, మంచి కార్పొరేట్ పాలనను బలోపేతం చేయడం వంటి బాధ్యతలను చార్టర్డ్ అకౌంటెంట్లు నిర్వహిస్తున్నారు. అయితే మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో సీఏల డిమాండ్ మున్ముందు భారీగా పెరుగనున్నది. ఈ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. సీఏ కోర్సు చేయాలని భావించే ఔత్సాహిక యువతీ యువకులకు, అలాగే ప్రస్తుతం చేస్తున్న వారికి సూచనలు, సలహాలు, లేదా ఇతర అంశాల విషయంలో సహకారం అందించడానికి మా బ్రాంచి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలి.
– వనపట్ల శేఖర్ రెడ్డి, ఐసీఏఐ కరీంనగర్ బ్రాంచ్ చైర్మన్
ఆసక్తి చూపితే మంచి భవిష్యత్
నేటి ప్రపంచంలో చార్టర్డ్ అకౌంటెంట్లకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు, బహుళజాతి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఫిన్‌టెక్, స్టార్టప్‌లు, స్వతంత్ర ప్రాక్టీస్, గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థల్లో విశేష అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అవసరానికి తగిన సంఖ్యలో యువత ఈ కోర్సును ఎంచుకోవడం లేదు. పాఠశాల, కళాశాల స్థాయి నుంచే ఈ కెరీర్‌పై అవగాహన పెంచడం, గ్రామీణ విద్యార్థులకు మార్గదర్శనం చేయడం ద్వారా మరింత మంది యువతను ఈ వృత్తి వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. కష్టపడి సీఏ పూర్తి చేస్తే.. అవకాశాలు మనల్నే వెతుక్కుంటూ వస్తాయి. ఇంకా వృత్తిలో రాణిస్తే.. మనమే పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఏర్పడుతుంది.
– ఎల్లంకి శ్రీవత్సవ్, యువ సీఏ