Operation Kagaar | కోల్ సిటీ, మే 22: అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలని బూటకపు ఎన్ కౌంటర్లకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని ఐఎఫ్టీయూఅధ్యక్షులు ఐ కృష్ణ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇ.సరేష్ ఆరోపించారు. ఈమేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఆపరేషన్ కగారు వెంటనే ఆపివేసి సైనిక బలగాలను వెనక్కి పిలవాలని, నిన్న జరిగిన బూటకపు ఎన్ కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శ నంబాల కేశవరావుతోపాటు మరో 28 మంది నక్సలైట్లు చనిపోయారనీ, ఈ సంఘటనపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని తగు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గడిచిన ఏడాది కాలంలో 500 మంది నక్సలైట్లను కిరాతకంగా చంపారనీ, ఈ నరమేధం ఆపాలని పౌర సమాజం కోరుతున్నా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందనీ, శాంతియుత్ చర్చలకు పిలవకుండా హింసాకాండను కొనసాగించడం సరికాదన్నారు.
2020కల్లా దేశంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకపోయే విధంగా చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎన్ కౌంటర్లో చనిపోయిన కేశవరావు, మిగతా సభ్యులకు విప్లవ జోహార్లు ప్రకటించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆశోక్, చిలుక శంకర్, రాజేశం, కొల్లూరి మల్లేశ్, మేరుగు దచంద్రయ్య, పైడిపల్లి రమేశ్, రవికుమార్, రాయమల్లు, మొండయ్య, బాబు, రాజనర్సు, సాంబయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు.