గంగాధర, జనవరి 23: మండలంలోని ఆయా గ్రామాల్లో వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఆదివారం ఇంటింటికీ వెళ్లి జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. లక్షణాలు ఉన్న వారిని హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించి, మందులు అందజేశారు. ఐదు రోజుల తర్వాత జ్వరం తగ్గకపోతే కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేసి చికిత్స అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
గంగాధర, జనవరి 23: మండలంలోని గర్శకుర్తిలో జ్వర సర్వే ఉత్సాహంగా చేపట్టారు. సర్పంచ్ అలువాల నాగలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. గర్శకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం వరకు 954 ఇండ్లల్లో సర్వే చేశారు. జ్వరంతో బాధపడుతున్న 31 మందిని గుర్తించి మెడికట్ కిట్లు అందజేశారు. జ్వర సర్వేకు వచ్చే సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ నాగలక్ష్మి సూచించారు. కార్యక్రమంలో నాయకుడు అలువాల తిరుపతి, కంప్యూటర్ ఆపరేటర్ గంగాధర రమేశ్, కారోబార్ మనోహర్, అంగన్వాడీ టీచర్లు ఎల్లమ్మ, ఉదయశ్రీ, లక్ష్మి, ఆశ కార్యకర్తలు స్వర్ణ, భారతి, లావణ్య, ఐకేపీ సిబ్బంది రేణుక, తార, శాంత తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, జనవరి 23: మండలంలో ఆదివారం వైద్య, పంచాయతీ సిబ్బంది జ్వర సర్వే చేపట్టారు. గుండి-గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 1,016 ఇండ్లల్లో సర్వే చేపట్టగా 17 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు వైద్యాధికారి సురేశ్ తెలిపారు. 62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పదిమందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. బాధితులకు మెడికల్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. పీహెచ్సీ పరిధిలో 37 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 19 టీంలు 730 నివాసాల్లో సర్వే చేయగా 23 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. 31 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. 64 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. వైద్యాధికారులు శ్రీనివాస్, సురేశ్, శిరీష, సీహెచ్‌వో నారాయణ, సూపర్వైజర్ పవన్‌కుమార్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.