కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 24 : రాజకీయాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి పనులకు తాను సహకరిస్తున్నా.. పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కనీస సమాచారం ఇవ్వరా..? అని అధికారులపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని నూతన కలెక్టరేట్ పక్కన సుడా నిధులతో కొత్తగా హెలీప్యాడ్, సర్వీస్ రోడ్డు, హెలీప్యాడ్‌కు ప్రవేశద్వారం ఏర్పాటుతోపాటు కలెక్టరేట్లో గార్డెన్ సుందరీకరణ పనుల కోసం బుధవారం శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాల్లో ప్రొటోకాల్ ప్రకారం మంత్రుల పేర్ల అనంతరం స్థానిక ఎమ్మెల్యే పేరుకు బదులు బల్దియా మేయర్ పేరు చేర్చారు. అలాగే, శంకుస్థాపన కార్యక్రమం వివరాల సమాచారం కూడా అధికారులు ఇవ్వకున్నా.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడికి చేరుకొని, సుడా, బల్దియా పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ పాటించకపోవడంపై కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌ని ప్రశ్నించారు.
నూతన కలెక్టరేట్ పరిసరాల్లో నిర్మిస్తున్న హెలీప్యాడ్ పనుల ప్రారంభ కార్యక్రమానికి తనకు అధికారికంగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహించారు. ఎమ్మెల్యేనైన తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ సందర్భంగా శిలాఫలకాల అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ, పేర్లు, హోదాలు, ఇతర వివరాల్లో తప్పులు దొర్లడాన్ని తప్పుబట్టారు. నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధుల వివరాలు సరిచూడకుండా శిలాఫలకాలు సిద్ధం చేయడం అధికార యంత్రాంగం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ సందర్భంగా మేయర్, సుడా చైర్మన్ మరోసారి పొరపాట్లు జరగనీయమంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, ఎమ్మెల్యే తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతమైతే సహించబోమని, అధికారులనే ప్రత్యక్ష బాధ్యులుగా చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సమర్ధవంతంగా ముందుకు సాగుతాయన్నారు.