Protocol controversy | చిగురుమామిడి, ఏప్రిల్ 10: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తహసీల్దార్ మద్దసాని రమేష్ సింగిల్ విండో చైర్మన్ జంగా రమణారెడ్డినికి సమాచారం ఇవ్వకపోవడం వివాదానికి దారి తీసింది. తహసీల్దార్ సింగిల్ విండో చైర్మన్ ను కావాలనే అక్కసుతో ప్రొటోకాల్ పాటించకుండా అవమానపరచాడని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్యతోపాటు పలువురు మండల నాయకులు తహసీల్దార్ తీరును తప్పుపట్టారు.
మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సమాచారం ఇవ్వడంలో తహసీల్దార్ ఆలసత్వం ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను నీరు కార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులే కాకుండా అధికార కాంగ్రెస్ నాయకులు సైతం తహసీల్దార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ తీరు మారనియెడల కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని నాయకులు హెచ్చరించారు. కాగా ఈ విషయంపై తహసీల్దార్ ను వివరణ కోరగా సమాచారం ఇవ్వమని సిబ్బందికి చెప్పానని తెలిపారు.