రాజన్న సిరిసిల్ల, జూలై 24 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు వినియోగించే విద్యుత్‌ను నాలుగో కేటగిరిలో చేర్చాలంటూ సిరిసిల్ల పవర్‌లూం అనుబంధ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) డిమాండ్ చేసింది. బుధవారం సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఎదుట పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు, యజమానులు పెద్ద సంఖ్యలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మూషం రమేశ్, పంతం రవి మాట్లాడుతూ, గత ప్రభుత్వం మరమగ్గాలకు యూనిట్‌కు 2 సబ్సిడీ ఇస్తే కాంగ్రె స్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి యూనిట్‌కు 8కి పెంచిందన్నారు. దీంతో మరమగ్గాలు నడపడం భారమై పోతున్నదని, వేలాది సాంచాలు తుక్కు కింద అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సెస్ అక్రమ వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వస్త్ర పరిశ్రను ఆదుకోవాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నేడు తలపెట్టిన సిరిసిల్ల పట్టణ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆడెపు రవీందర్, ఆడెపు భాస్క ర్, గోవిందు రవి, మండల సత్యం, దూడం శంకర్, ఏనుగుల ఎల్లయ్య, ఆనంద్‌బాబు పాల్గొన్నారు.