పెద్దపల్లి, సెప్టెంబర్ 30 : తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, తమకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ గేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేసి, అందులో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల వేతనాల జీవోలను సవరించాలన్నారు. పెద్దపల్లి జిల్లాలోని రైస్ మిల్లుల్లో సుమారు 8వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలన్నారు. అనంతరం స్థానిక సంస్థల కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, సహాయ కార్యదర్శులు తాండ్ర అంజయ్య, సీపెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.