Prohibitory orders | కోల్ సిటీ, సెప్టెంబర్ 1 : రామగుండం నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, చెట్లకు, విద్యుత్ స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టడం పట్ల నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమించి ఫ్లెక్సీలు కడితే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.