Kamanpur | కమాన్ పూర్, మే 5 : ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంతోపాటు సిద్ది పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని బుర్రకాయలపల్లి లో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లోని రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు తాటికొండ శంకర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయని, ధాన్యం తూకం 40 ఒక కిలోలు పెట్టాల్సి ఉండగా 42 కిలోలు పెడుతున్నారని ఆరోపించారు. మండే ఎండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నది ఒక్కటీ ఆచరణలో అమలవుతున్నది మరొక్కటి అన్న చందంగా మారిందన్నారు.
రైతులు ప్రభుత్వం తీరును గమనిస్తున్నారని రాబోయే కాలంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని, 41 కిలోల తూకం మాత్రమే వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీ మల్లు, మాజీ సర్పంచ్ కొండ వెంకటేష్, నాయకులు జాబు సతీష్, కుందారపు సత్యనారాయణ, పెండ్లి నారాయణ, పంతకని రవి, రాచకొండ రవి, కమ్మగోని భాస్కర్, తోట రాజకుమార్, ఎలాబోయిన రామ్మూర్తిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.