కాల్వశ్రీరాంపూర్, మార్చి 3 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపెల్లి మానేరువాగుపై ‘దారి’ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. ‘మానేరువాగుపై మరో దారిదోపిడీ’ అనే శీర్షికన ఈ దందాను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేగా, సోమవారం సైతం ప్రైవేట్ టోల్ నిర్వాహకులు రెచ్చిపోయి వసూళ్లు చేశారు.
ఉదయం 11గంటల వరకు అధికారులెవరైనా వస్తారేమోననుకొని నిర్వాహకులు ఎవరూ రాలేదు. దీంతో వాహనదారులు ఎలాంటి వసూళ్లు లేకుండా సంతోషంగా వెళ్లారు. కానీ, మళ్లీ 12 గంటల నుంచి యధావిధిగా టోల్ వసూలు చేస్తూ బరితెగించారు. అధికారుల్లో చలనం లేకపోవడంవల్లనే ఈ తతంగం నడస్తున్నదని వాహనదారులు మండిపడ్డారు.