Collector Koya Sri Harsha | రామగిరి, జూన్ 03: ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్స్ అందించేందుకు అవసరమైన శిక్షణ సజావుగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లకు జరుగుతున్న శిక్షణ శిబిరాన్ని మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ భూ భారతి చట్టం ప్రకారం భూ క్రయ విక్రయాలకు, మ్యూటేషన్ కోసం తప్పనిసరిగా భూమి మ్యాప్ జత చేయాల్సి ఉంటుందని, ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించి భూ సర్వే నిర్వహించే మ్యాప్ తయారు చేసేందుకు ప్రైవేట్ సర్వేలకు ప్రభుత్వం అనుమతి అందిస్తూ లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెడుతుందని, ఇందులో భాగంగా ముందస్తుగా 6000 లకు పైగా ప్రైవేట్ సర్వేలకు లైసెన్స్ జారీ చేసేందుకు ప్రభుత్వం శిక్షణ అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.
మన పెద్దపల్లి జిల్లాలో రెండు బ్యాచ్ లలో 112 మంది ప్రైవేట్ సర్వేయర్లకు భూ భారతి చట్టం, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సర్వే పద్దతుల పై మే 26 నుంచి జూలై 26 పాటు రెండు నెలలు సుదీర్ఘంగా శిక్షణ అందిస్తామని, శిక్షణ అనంతరం ప్రైవేట్ సర్వేయర్లకు ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుందని, ప్రభుత్వ భూముల సర్వేనిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
భూ భారతి చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు సర్వేయర్ల అవసరం చాలా ఉంటుందని , శిక్షణ సజావుగా సంపూర్ణంగా అందేలా అధికారులు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, డిప్యూటీ ఐఓఎస్ గణపతి, రఘుపతి అనిల్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.