కాల్వశ్రీరాంపూర్, జూన్ 20 : ‘ప్రైవేట్ పాఠశాలలు వద్దు. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు’ అంటూ కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లె గ్రామస్తులు నినదించారు. శుక్రవారం గ్రామానికి చెందిన విద్యార్థులంతా ప్రైవేట్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో గ్రామస్తులంతా అక్కడకు వచ్చి వాహనాలు ఎక్కకుండా అడ్డుకున్నారు.
తమ గ్రామానికి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రావద్దని హెచ్చరించారు. ప్రైవేట్‌కు తరలివెళ్తున్న విద్యార్థులను బస్సుల్లోంచి దింపేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎంఈవో మహేశ్ అక్కడకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ప్రైవేట్‌కు పంపవద్దని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.