ప్రైవేట్ బస్సులు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. ఏసీ, స్లీపర్ కోచ్ అని రక రకాల పేర్లు చెబుతున్నా.. నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం వద్ద జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవదహనం కావడం, అందులో జగిత్యాల, కోరుట్ల, రాయికల్ ప్రాంతాల్లో నివాసముంటున్న ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు ఉండడం కలిచివేసింది. ఈ ప్రమాదం ఎన్నో ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. మార్కాపురం వద్దనే కాదు, కొన్నేండ్లలో జరిగిన ప్రైవేట్ బస్సుల ప్రమాదాలను పరిశీలిస్తే.. ప్రైవేట్ సర్వీసుల్లో నిబంధలను పాటించకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలుస్తున్నది. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే యంత్రాంగం స్పందిస్తున్నా.. ఆ తర్వాత చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
జగిత్యాల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : గల్ఫ్ దేశాల్లో జగిత్యాల జిల్లా నుంచి వందలాది మంది కార్మికులు ఉన్నారు. అలాగే ముంబై, నాగపూర్, భీవండి, సూరత్ ప్రాంతాల్లోనూ కార్మికులుగా పనిచేస్తున్నారు. అలాగే జగిత్యాలతోపాటు చుట్టు పక్క ప్రాంతాల్లో వేలాది మంది ఆంధ్ర రాష్ర్టానికి చెందిన వారు స్థిరపడి ఉన్నారు. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎంతో మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నుంచి ఇతర దూర ప్రాంతాలకు ప్రతి రోజూ పదిహేను నుంచి ఇరవై వరకు ప్రైవేట్ బస్సులు నడుస్తుండగా, వేలాది మంది ప్రయాణికులు జగిత్యాల నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు.
నిబంధనలు బేఖాతరు
మోటర్ వాహనాల నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులకు సంబంధించి రెండు విధానాలు ఉంటాయి. ఒకటి స్టేజీ క్యారేజ్.. రెండో కాంట్రాక్టు క్యారేజ్. స్టేజీ క్యారేజ్ అంటే.. స్టేజీల వద్ద బస్సును నిలిపి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు అనుమతి అని అర్థం. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులకు స్టేజీ క్యారేజ్‌ల నిర్వహణకు అవకాశం ఉండేది. అయితే దీని వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని భావించిన తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ బస్సులకు స్టేజీ క్యారేజ్‌ల సిస్టంను నిషేధించింది. కేవలం ఆర్టీసీకి మాత్రమే అప్పగించింది. ప్రైవేట్ సర్వీసుల కోసం కాంట్రాక్టు క్యారేజ్‌లకు అవకాశం కల్పించింది. కాంట్రాక్టు క్యారేజ్ అంటే.. ఒక ఊరు నుంచి మరో ఊరుకు ప్రయాణానికి అనుమతి తీసుకొని, దానికి నిర్దేశిత రుసుం చెల్లించి నడుపుకోవాలి.
ఆ రెండు గ్రామాల మధ్య ఎక్కడ బస్సులను ఆపి ప్యాసింజర్లను బస్సులోకి ఎక్కించుకునేందుకు అనుమతి ఉండదు. వివాహాలు, శుభ కార్యక్రమాలు, తీర్థయాత్రలు తదితర అవసరాల కోసం ఈ కాంట్రాక్టు విధానాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఈ నిబంధనలను ప్రైవేట్ బస్సులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. జగిత్యాల నుంచి ముంబై, నాగపూర్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రైవేట్ బస్సులు నిత్యం పదుల సంఖ్యలో నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం స్టేజీ క్యారేజ్ విధానం అమలులో లేదు. అన్ని బస్సులు ఆలిండియా పర్మిట్ 2023 ప్రకారం కాంట్రాక్టు క్యారేజ్ పద్ధతిలో బస్సు రూట్ పర్మిట్ పొందినవే. అయినా అన్ని ప్రైవేట్ బస్సులు స్టేజీ క్యారేజ్లనే నిర్వహిస్తున్నాయి. మార్కాపురం వద్ద జరిగిన ప్రమాదంలో బస్సు ట్రిప్షీట్ను, ప్రయాణికులు ఆన్లైన్లో బుక్ చేసిన ప్రైవేట్ బస్సు ఎస్ఆర్ షీట్లు వెలువడ్డాయి. జగిత్యాల నుంచి ప్యాసింజర్లతో బయలుదేరిన కాంట్రాక్టు క్యారేజ్ బస్సు, కోరుట్లలో ఆరుగురు ప్యాసింజర్లను, నిర్మల్‌లో ఇద్దరిని, ఆర్మూర్‌లో నలుగురిని ఇలా పట్టణాల్లో ఆగుతూ.. ప్రయాణికులను బస్సులోకి ఎక్కించుకొని వెళ్లినట్టు స్పష్టమైంది.
ఆలిండియా పర్మిట్‌తో ఇబ్బంది
2023లో భారత ప్రభుత్వం ఆలిండియా పర్మిట్ 2023 చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఒకరకంగా ప్రైవేట్ బస్సుల వారికి ఊతమిచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ప్రైవేట్ బస్సులకు, ప్రైవేట్ బస్సుల రూట్లకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చేవి. అలాగే వాటిని పర్యవేక్షించడంతోపాటు ట్యాక్స్‌లను సైతం రాష్ట్ర మోటర్ వెహికిల్ శాఖ పరిధిలోనే నిర్వహించేవారు. అయితే ఆలిండియా పర్మిట్ 2023 చట్టం ప్రకారం అందులో మార్పులు వచ్చాయి. జాతీయ స్థాయిలో బస్సుల రిజిస్ట్రేషన్, రూట్ల పర్మిషన్ అంతా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్లిపోయింది. దేశంలో ఏ రాష్ర్టానికి చెందిన వాహనమైన ఆలిండియా పర్మిట్ తీసుకొని రూట్లను నిర్దేశించుకొని బస్సులను నడుపుకునే అవకాశం లభించింది.
అలాగే రాష్ట్రస్థాయిలో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాలను చట్టం కల్పించింది. అయితే రిజిస్ట్రేషన్ ఫీజును ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలే నిర్దేశించుకునే అవకాశాలు కల్పించబడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు చాలా ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ బస్సుల యజమానులు తూర్పు ఈశాన్య రాష్ర్టాలైన అస్సాం, మేఘాలయ, సిక్కిం లాంటి చోట్ల బస్సులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అలాగే అక్కడే ఆలిండియా పర్మిట్‌కు రూట్లకు సంబంధించిన ఫీజులను చెల్లిస్తున్నారు. దీంతో సంబంధిత రూట్లు ఉన్న రాష్ర్టాల్లోని మోటర్ వెహికిల్ అధికారులు సైతం ఏమి చేయలేని దుస్థితి నెలకొంది. ఈ విషయమై ఓ మోటర్ వెహికిల్ శాఖ అధికారి మాట్లాడుతూ.. ‘మేము ఏం చేస్తాం.
మా చేతిలో ఏమి లేదు. ప్రైవేట్ బస్సుల వాళ్లు రూట్ పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. వేరే రాష్ర్టాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. వారిని అడ్డుకునే అవకాశం మాకు లేదు. మాకు చట్టంలో ఉన్న ఒకే ఒక్క అవకాశం, అధికారం స్టేజీ క్యారేజీ నిషేధం. అయితే దాన్ని నిరూపించేందుకు సైతం మాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురువుతుంది. చాలా సార్లు ప్రయాణికులు మాకు సహకరించడం లేదు. మేము అంతా ఒకే కుటుంబం, తీర్థయాత్రలకు పోతున్నాం అంటున్నారు. మేమే ఏం చేయాలో అర్థం కాదు.
కాదు కూడదని ఫైన్ వేస్తే ఒక్కరోజులో చెల్లించి బస్సులను యథావిధిగా నడుపుతారు. గతంలో మన వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ బస్సులు మూడు నెలలకోసారి సీట్ల ఆధారంగా ట్యాక్స్ చెల్లించేవి. అలాగే రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం వచ్చేవి. దీంతో కొంత బస్సుల నాణ్యత, కండీషన్‌ను పరిశీలించేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. ఏ రాష్ట్రంలో అయితే బస్సు రిజిస్ట్రేషన్ అయిందో ఆ లోకల్ స్టేట్‌కు, లోకల్ జిల్లాకు నెలలో ఒక్కసారైన సదరు ప్రైవేట్ బస్సు వెళ్లాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు అది అమలవుతున్నట్టు కనిపించడమే లేదు. పోనీ ఏమైనా చేద్దామన్నా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులంతా రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లే’ అంటూ వాపోయాడు.
ప్రైవేట్ బస్సుల నిర్మాణాల్లో లోపాలు

ఆలిండియా పర్మిట్‌తో నడుస్తున్న అన్ని ప్రైవేట్ బస్సులు ఏసీ, స్లీపర్ కోచ్‌గానే ఉన్నాయి. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం కావడంతో ప్రయాణికులు సైతం వాటికే మొగ్గుచూపుతున్నారు. అయితే స్లీపర్ కోచ్ బస్సుల్లో అనేక నిర్మాణ లోపాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్, బ్యాటరీ కంపోనెంట్లు పక్క పక్కనే ఉంటున్నాయని, ఇది ప్రధాన ఇబ్బంది అని పేర్కొంటున్నారు. బస్సుకు చిన్న ప్రమాదం జరిగినా ఇవి రెండు పక్కపక్కనే ఉండడంతో మంటలు త్వరగా వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు.
అలాగే బస్సు సెంటర్ ఆఫ్ గ్రావిటీ సక్రమంగా ఉండడం లేదని, బరువైన ఇంజిన్, చాసిస్ దిగువన ఉండడం, అప్పర్ బెర్త్‌లపైకి ప్యాసింజర్లు చేరుకోగానే బ్యాలెన్స్ దెబ్బతింటున్నదని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. దీంతో బస్సు సిర్థత్వం తప్పిపోయి రన్నింగ్ సమయంలో బస్సు బ్యాలెన్స్ తప్పుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే బెర్తుల మధ్య ప్యాసింజర్లు నడిచేందుకు సరైన వైశాల్యం ఉండడం లేదని, అలాగే పై బెర్తుల నుంచి దిగడానికి సైతం సరైన ఏర్పాట్లు ఉండడం లేదని, దీంతో ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు బస్సు సీట్ల మధ్య ఉన్న ఇరుకు దారిలో వేగంగా నడువ లేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
అలాగే అప్పర్ బెర్త్‌ల నుంచి వేగంగా దిగువకు వచ్చి తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంటున్నారు. బస్సు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనే ప్రైవేట్ బస్సుల నిబంధనల ఉల్లంఘనలు, ప్రభుత్వాలు, అధికారుల ఉదాసీన వైఖరిపై చర్చ జరుగుతున్నదని, రెండుమూడు రోజులు గడిచిపోగానే విషయం యాథావిధిగా మారిపోవడం సహజంగా మారిపోతున్నదని ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ప్రమాదాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అధికారుల చేతులను కట్టివేసేలా ఉన్న మోటర్ వెహికిల్ చట్టాల్లోను మార్పులు తేవాలని, ప్రైవేట్ బస్సులు నిబంధనలను కచ్చితంగా పాటింపజేసేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ బస్సుల నిర్మాణంలో ఉన్న లోపాలను సవరించేలా చూడాలని కోరుతున్నారు.