మల్యాల, మే 12: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. సేద్యం ఆగమాగమవుతున్నది. పథకాల అమలులో అనేక కొర్రీలు పెడుతూ సేద్యానికి దూరం చేస్తుండగా, మరోవైపు పచ్చిరొట్ట ధరలు పెంచి, సబ్సిడీపై కోత పెట్టి మరో పిడుగు వేసింది. రూ.వందో.. రెండొందలో కాదు ఏకంగా రెండింతలు చేసి మోయలేని భారం మోపింది. రైతులు ఏటా సాగుకు ముందు భూమి సారవంతానికి, పంట దిగుబడి కోసం పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగ, పిల్లిపెసర చల్లుకుంటారు. ఏపుగా పెరగ్గానే కలియదున్ని ఎరువుగా మార్చుకొని నేలను సాగుకు సంసిద్ధం చేసుకుంటారు. అయితే ఈ యేడాది విత్తనాల ధరను భారీగా పెంచేసింది గతేడాది 30 కిలోల జీలుగు విత్తనాల బస్తా ధర 1,116 ఉండగా, ఈ యేడాది 2,137.50 పెరిగింది.
అంటే ఒక్కో బస్తాపై అదనంగా 1021.50 పెంచింది. అదే 40 కిలోల జనుము బస్తా గతేడాది 1,448 ఉండగా, అది ఇప్పుడు 2510కు చేరింది. అంటే 1,062 అదనంగా పెరిగింది. గతేడాది పిల్లిపెసరు 20 కిలోల బస్తా ధర 1,084 ఉండగా, ఈ యేడాది 2,055కు పెంచింది. అంటే ఒక్క బస్తాపై అదనంగా 971 పెరిగింది. గతేడాది పచ్చిరొట్ట విత్తనాలపై 60 శాతం సబ్సిడీపై ఇవ్వగా, ఈ యేడాది 10 శాతం కుదించి 50 శాతం రాయితీకి అందజేయాలని నిర్ణయించింది. సీజన్‌కు ముందే ఇలా విత్తనాలు రేట్లు పెంచి, సబ్సిడీని కుదించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు సరికాదని , వెంటనే దించాలని డిమాండ్ చేస్తున్నారు.