పెద్దపల్లి, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కార్మికక్షేత్రంలో జోష్ నింపారు. గోదావరిఖనిలోని జవహర్లాల్ స్టేడియంలో నిర్వహించిన రామగుండం నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై, తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. 22 నిమిషాల పాటు ప్రసంగించి ఫుల్ జోష్ నింపారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం, అనుభవించిన కష్టాలు, సింగరేణికి కాంగ్రెస్ చేసిన నష్టం.. స్వరాష్ట్రంలో సాధించిన విజయాలు, సింగరేణిని కాపాడుకున్న తీరును వివరించారు. ఇక్కడ చేసిన ఉద్యమాలను, కార్మికుల సమ్మెలను గుర్తు చేశారు.
నాడు సింగరేణిని ముంచింది, కార్మికులను ఆగం చేసింది కాంగ్రెస్సేనని, 100శాతం ఉన్న సింగరేణి వాటాను 49శాతం కోల్పోవడానికి ఆ పార్టే కారణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీబీజీకేఎస్‌తో జరిగిన ప్రయోజనాలను కార్మిక లోకానికి అర్థమయ్యే రీతిలో వివరించారు. సీఎం మాట్లాడుతున్న సమయంలో సింగరేణి కార్మికులు కేరింతలు కొడుతుండగా.. గోదావరిఖని అంటే గట్లనే ఊపుంటుందని, కథ వేరే ఉటుందని, కౌషిక్ హరీ.. అంతేకదా అని ఆయన చలోక్తి విసరగా, కార్మికులు, ప్రజలు ఒక్కసారిగా ‘ఔర్ ఏక్ దక్కా.. కేసీఆర్ పక్కా’ అంటూ నినాదాలు చేశారు.
ప్రధానంగా టోపీలు ధరించి తరలివచ్చిన సింగరేణి కార్మికులు, గులాబీ జెండాలు ఊపుతూ హుషారెత్తించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. జైకొడుతూ హోరెత్తించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెప్పారు. అదరి భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటేనని, విచక్షణతో ఓటు వేయాలని, అభ్యర్థులు.. వారి వెనక ఉన్న పార్టీలను చూడాలని, ఆగం కావొద్దని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌కు ఎందుకు ఓటు వేయాలో వివరించారు.
మీ కష్టాలు కన్నీళ్లు తెలిసిన చందర్‌ను గెలిపిస్తే రామగుండాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల పెర్క్స్ టాక్స్ మాఫీ చేస్తానని ప్రకటించారు. కోరుకంటిని మీకు లాభమైతదని చెప్పారు. రైతుబంధు రావాలన్నా.. 24గంటల కరెంట్ ఉండాలన్నా.. చందర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకొకన్ని చేయమంటే కుదరదని, చందర్‌ను గెలిపించినపుడే ఇవన్నీ సాధ్యమవుతాయని అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్కు ఓటు వేద్దామా..? మూడు గంటల కరెంటే ఇస్తమంటున్న కాంగ్రెస్‌కు ఓటు వేద్దామా..? అనేది మీరే ఆలోచించాలని ప్రజలను కేసీఆర్ కోరారు.
రామగుండం ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో నల్లనేల పులకించింది. శుక్రవారం గోదావరిఖనిలో నిర్వహించిన రామగుండం ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఫుల్ జోష్ నింపింది. నియోజకవర్గ ప్రజానీకం, సింగరేణి కార్మికలోకం వేలాదిగా తరలివచ్చి, అధినేతకు జైకొట్టింది.
ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక బలమైన ఆయుధం ఓటు. దానిని సద్వినియోగ పరిస్తే మంచి ప్రభుత్వం, మంచి ఫలితం వస్తుంది. తమ్ముడు చెప్పాడనో.. బామ్మర్ది చెప్పాడనో.. విచక్షణా రహితంగా ఓటేస్తే గోల్మాల్ అయితది. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు, రామగుండం, గోదావరిఖని భవిష్యత్తు, మీ అందరి భవిష్యత్తు మీరు వేసే ఓటుపైనే ఆదారపడి ఉంటది. అందుకే ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలి. ఈ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటది, రామగుండం ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటదో ఆలోచించి ఓటు వేస్తే మంచి జరుగుతది.
– ముఖ్యమంత్రి కేసీఆర్
ధరణితో ఇప్పుడే మీ భూములకు మీరే అధికారులైన్రు. అంతకుముందు తాకలాటలు, జుట్లు ముడేసుడు ఎట్లుండె. ధరణి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి కూడా భూములను మార్చే అధికారం లేకుండా చేసినం. ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీ బొటన వేలుకు, మీ బయోమెట్రిక్‌కు అధికారం ఇచ్చినం. దాన్ని ఉంచుకుంటరా..? పోడగొట్టుకుంటరా..? ఆలోచించండి.. భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీ బాజాప్తా చెప్తున్నరు. రాహుల్ గాంధీకి ఎద్దూ.. ఎవుసం ఉన్నదో లేదో నాకు తెల్వదుగానీ, ధరణిని తీసి బంగాళఖాతంలో వేస్తమంటున్నడు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు రైతులకు ఎలా అందుతయి? పైరవీలు షురు అయితయి. దళారీల దందాలు మొదలైతయి. అందుకే రైతులు జాగ్రత్తగా ఉండాలె. ఎవరి చేతిలో ఉంటే రైతులు, ప్రజలు సురక్షితంగా ఉంటరనేది ఆలోచన చేయాలి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
బీఆర్ఎస్ మీ కండ్ల ముందే పుట్టింది. పార్టీ ప్రస్థానమంతా మీ కండ్ల ముందే జరిగింది. తెలంగాణ కోసం ఏవిధంగా పోరాడింది? రాష్ట్రం సాధించిన తర్వాత పదేళ్లలో ఏవిధమైన అభివృద్ధిని సాధించింది? అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసం లేదు. ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన చరిత్ర కాంగ్రెస్‌ది. వేరే స్టోరీలు అవసరం లేదు. సింగరేణిని ముంచింది, ఉన్న తెలంగాణను ముంచి, వంచించింది కాంగ్రెస్సే కదా.
కోరుకంటి చందర్ సింగరేణి కార్మికుడి కొడుకు. ఉద్యమకారుడు. రాష్ట్రం కోసం 74 రోజులు జైల్ల ఉన్నడు. అలాంటి ఉద్యమ ప్రస్థానం ఉన్న నాయకుడు మీ ఎమ్మెల్యే. ఆయనకు ఈ ప్రాంత ప్రజలు, కార్మికుల కష్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. ఏది మంచి.. ఏది చెడు అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నది. చందర్ ఉంటే మీకు లాభమైతది. కార్మిక బిడ్డ చందర్‌కు సపోర్ట్ చేయండి. మీకు అన్ని విధాలా అండగా ఉంట. మరోసారి గెలిపించండి. నీళ్లు..బొగ్గు.. రవాణా, రైలు రూట్లు ఉన్న ఈ ప్రాంతానికి అనువైన పరిశ్రమలను తీసుకొస్త. రామగుండంను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్త.
– ముఖ్యమంత్రి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జనం నీరాజనం పట్టారు. శుక్రవారం నిర్వహించిన రామగుండం నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అశేషంగా పోటెత్తారు. గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ సభకు, నియోజకవర్గంలోని రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లతోపాటు రామగుండం అర్బన్, అంతర్గాం, పాలకుర్తి మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. సభకు వెళ్లే దారుల్లో ఎటు చూసినా జనమే కనిపించారు. సభా ప్రాంగణంలోనూ కిక్కిరిసిపోయారు. సభ ప్రారంభానికి ముందు కళాకారుడు ఏపూరి సోమన్న ‘కారే గెలవాలి.. మళ్లీ సారే రావాలి.. పల్లె పల్లెనా సంక్షేమ పథకాలు తేవాలి’ అనే పాటతో ఉర్రూతలూగించారు.
ఇదే సమయంలో హెలీకాప్టర్‌లో వస్తున్న కేసీఆర్‌ను చూసి సభికులు కేరింతలు కొట్టారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఆయన రాగా, ఈలలు, చప్పట్లతో స్వాగతించారు. సీఎం ప్రసంగ సమయంలో ఆద్యంతం ‘జై కేసీఆర్’ ‘జైజై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ప్రధానంగా సింగరేణి కార్మికులు గులాబీ కండువాలు ఊపుతూ మద్దతు తెలిపారు. స్థానిక అంశాలను ప్రస్తావించిన ప్రతీ సారి కేరింతలు కొట్టారు. మొత్తంగా పెద్ద సంఖ్యలో జనం రావడం, సీఎం తన ప్రసంగంతో ఉత్సాహం నింపడంతో ప్రతి ఒక్కరిలోనూ జోష్ నిండింది. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో గెలుపు ధీమా వ్యక్తమైంది.